Beetroot Halwa : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో బీట్‌రూట్ కూడా ఒకటి. ఇది మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. బీట్‌రూట్‌ను తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా దీన్ని తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మలబద్దకం ఉండదు. గ్యాస్, అజీర్ణం ఇబ్బంది పెట్టవు. అలాగే రక్తం అధికంగా ఉత్పత్తి అవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. బీపీ అదుపులో ఉంటుంది. దీంతో గుండె జబ్బులు రావు. ఇలా బీట్‌రూట్‌తో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే బీట్‌రూట్‌ను చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ దాంతో ఎంతో రుచికరమైన హల్వాను చేసుకుని తినవచ్చు. ఇది భలే టేస్టీగా ఉంటుంది. బీట్ రూట్ అంటే ఇష్టం లేకున్నా.. దాంతో హల్వాను చేస్తే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. బీట్ రూట్ హల్వాను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్ రూట్ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
బీట్ రూట్ – అర కిలో, ఫ్యాట్ తీయని పాలు – మూడు కప్పులు, చక్కెర – 6 టేబుల్ స్పూన్లు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అర టీస్పూన్, జీడిపప్పు – 10 పలుకులు, ఎండు ద్రాక్ష – 1 టేబుల్ స్పూన్.

బీట్ రూట్ హల్వాను తయారు చేసే విధానం..
బీట్‌రూట్‌ను శుభ్రంగా కడిగి పొట్టు తీసి తురుముకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి పాలు పోసి బీట్‌రూట్ తురుము వేసి చిన్న మంటపై పెట్టి మరిగించుకోవాలి. పాలు బాగా మరిగి సగానికి తగ్గినప్పుడు నెయ్యి, చక్కెర వేసి కలుపుకోవాలి. చిన్న మంటపై ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చివరిగా జీడిపప్పు, యాలకుల పొడి, ఎండు ద్రాక్ష వేసుకోవాలి. పాలు పూర్తిగా ఆవిరైపోయాక స్టవ్‌పై నుంచి దింపుకుంటే బీట్‌రూట్ హల్వా రెడీ అయినట్టే. దీన్ని వేడిగా తినవచ్చు. లేదా ఫ్రిజ్ లో పెట్టుకుని చల్లగా కూడా తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. బీట్ రూట్‌ను తినడం ఇష్టం లేని వారు ఇలా హల్వాను చేసి తినవచ్చు. దీంతో రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండూ లభిస్తాయి.