Nasal Congestion : చలికాలంలో సహజంగానే చాలా మందికి ముక్కు దిబ్బడ సమస్య వస్తుంటుంది. జలుబు ఉన్నా లేకపోయినా.. ముక్కు మూసుకుపోయి ఇబ్బందులు వస్తాయి. కొందరికి ఈ సమస్య ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ చలికాలంలో ఇది మరింత ఎక్కువవుతుంది. ఇక సైనస్ ఉన్నవారికి ఇది ఎల్లప్పుడూ ఉంటుంది.
ముక్కులో మ్యూకస్, దుమ్ము, ధూళి పేరుకుపోయి అలర్జీ కారణంగా.. పలు ఇతర కారణాల వల్ల కూడా ముక్కు దిబ్బడ వస్తుంటుంది. ఇలాంటి సమయంలో ముక్కు రంధ్రాలు రెండూ మూసుకుపోయి శ్వాస కూడా సరిగ్గా ఆడదు. దీంతో రాత్రి సమయంలో నిద్ర పట్టక అవస్థలు పడుతుంటారు. ఇక ప్రస్తుతం కోవిడ్ సమయం కనుక కొందరు కరోనా వ్యాధిగ్రస్తులకు కూడా ఈ సమస్య వస్తోంది. అందుకని ఈ సమస్య ఉన్నవారు నిర్లక్ష్యం చేయరాదు. దీని నుంచి బయట పడే ప్రయత్నం చేయాలి.
ముక్కు బాగా మూసుకుపోయి ముక్కు దిబ్బడతో అవస్థలు పడుతున్న వారు కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల చక్కని ఉపశమనం లభిస్తుంది. అందుకు ఏం చేయాలంటే..
1. మూసుకుపోయిన ముక్కు రంధ్రాలను తెరిపించేందుకు కొబ్బరినూనె బాగా పనిచేస్తుంది. కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని వేడి చేసి ఒక్కో ముక్కు రంధ్రంలో రెండు చుక్కల చొప్పున వేయాలి. అనంతరం దీర్ఘ శ్వాస తీసుకోవాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే సమస్య ఉండదు. శ్వాస సరిగ్గా ఆడుతుంది.
2. శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో తేనె బాగా పనిచేస్తుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం అందిస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనె కలిపి రోజుకు రెండు సార్లు.. ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. దీంతో తక్షణమే ఉపశమనం లభిస్తుంది. ముక్కు దిబ్బడ తగ్గిపోయి రంధ్రాలు వదులుగా మారుతాయి.
3. ముక్కు దిబ్బడ సమస్యను తగ్గించేందుకు కర్పూరం, వాము గింజలు బాగా పనిచేస్తాయి. ఒక కర్పూరం బిళ్ల, కొన్ని వాము గింజలను తీసుకుని పొడి చేయాలి. దాన్ని ఒక పలుచని, శుభ్రమైన వస్త్రంలో వేసి ముడిలా చుట్టాలి. అనంతరం ఆ ముడిని ముక్కు దగ్గర పెట్టుకుని కొద్ది కొద్దిగా వాసన పీలుస్తుండాలి. ఇలా చేస్తుంటే ముక్కు రంధ్రాలు వదులుగా మారుతాయి. ముక్కు దిబ్బడ తగ్గి శ్వాస సరిగ్గా ఆడుతుంది.