Bheemla Nayak : ఏపీలో గత కొద్ది నెలలుగా ఉన్న సినిమా టిక్కెట్ల ధరల సమస్య ఎట్టకేలకు పరిష్కారం అయింది. మెగాస్టార్ చిరంజీవి చొరవతో ఈ సమస్యలకు చెక్ పడినట్లు అయింది. చిరంజీవి పలు మార్లు సీఎం వైఎస్ జగన్‌ను కలిసి సమస్య పరిష్కారానికి ఎంతో కృషి చేశారు. దీంతో ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేసింది. దీంతో త్వరలో విడుదల కాబోయే సినిమాలకు ఇది ఎంతగానో హెల్ప్ కానుంది. అయితే సినిమా టిక్కెట్ల ధరలపై కొత్త జీవో విడుదల కావడంతో.. ఇప్పుడు ఈ విషయం ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.
భీమ్లా నాయక్ చిత్రం రిలీజ్ అయినప్పుడు జీవో విడుదల కాలేదు. ఇప్పుడే అయింది. కనుక అప్పుడు పాత ధరలే ఉన్నాయి. ఇక అప్పుడు థియేటర్లు ఇష్టం వచ్చినట్లు రేట్లను పెంచరాదని, అదనపు షోలను ప్రదర్శించుకునేందుకు కూడా వీలు లేదని ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పేసింది. అయితే పవన్ సినిమాను తొక్కేయడానికే ఇలా చేస్తున్నారంటూ.. కొందరు ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కానీ గతంలో ఉన్న రేట్లే ఇప్పుడు కూడా ఉన్నాయని.. పవన్ సినిమాపై ప్రత్యేకమైన ఆంక్షలు ఏమీ విధించలేదని.. ఏపీ మంత్రులు అన్నారు. దీంతో ఆ వివాదం అక్కడికి సద్దుమణిగింది. అయితే ఇప్పుడు జీవో రావడంతో.. ఇది భీమ్లా నాయక్‌కు మైనస్ అయిందని.. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు ప్లస్ అయిందని అంటున్నారు.
ఈ జీవో విడుదల కావడం వల్ల తక్షణమే హెల్ప్ జరిగేది రాధే శ్యామ్ సినిమాకే. దీంతో ఈ చిత్ర నిర్మాతలు ఊపిరి పీల్చుకోనున్నారు. నష్టాల బారిన పడకుండా తప్పించుకున్నారు. ఇక మార్చి 25న విడుదలయ్యే ఆర్ఆర్ఆర్ మూవీకి కూడా ఈ కొత్త జీవో హెల్ప్ చేస్తుంది. కానీ భీమ్లా నాయక్ కథ ముగిసింది కనుక ఇప్పుడు ఆ చిత్రానికి ఎలాంటి ప్రయోజనం జరగదు. కనుక ఈ సినిమా మేకర్స్ నష్టాలను చవిచూశారని.. దీంతో వారికి ఈ విషయం మైనస్ అయిందని అంటున్నారు.
అయితే భీమ్లా నాయక్ విడుదల తరువాతే ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల చేస్తుందని.. పవన్ మీద కక్షతోనే ఏపీ ప్రభుత్వం ఇలా చేస్తుందని గతంలోనే కొందరు ఆరోపించారు. కానీ అందులో నిజం ఉన్నా లేకపోయినా.. వారు చెప్పినట్లే జరిగింది. భీమ్లా నాయక్ విడుదల తరువాతే కొత్త జీవో వచ్చింది. కనుక సహజంగానే ఏపీ ప్రభుత్వంపై నిందలు వేస్తారు. కానీ భీమ్లా నాయక్ చిత్ర విడుదలను కూడా ఆపి ఉంటే ఇప్పుడు కొత్త జీవో వచ్చి ఉండేదా ? అని కూడా చర్చించుకుంటున్నారు. ఇక ఇందులో అసలు విషయం ఏమిటో ఆ దేవుడికే తెలియాలి. ఏది ఏమైనా తాజా జీవోతో టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుందని చెప్పవచ్చు.