Biscuits : మనకు బయట షాపుల్లో, బేకరీల్లో ఎక్కువగా లభించే పదార్థాల్లో బిస్కెట్లు కూడా ఒకటి. వీటిని పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు. బిస్కెట్లను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా తయారు చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బిస్కెట్లను మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ బిస్కెట్లు నెల రోజుల పాటు తాజాగా ఉంటాయి. రుచిగా అందరూ ఇష్టంగా తినేలా బిస్కెట్లను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బిస్కెట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – అర కప్పు, బొంబాయి రవ్వ – అర కప్పు, పంచదార – పావు కప్పు, పాలు – తగినన్ని, ఎండు కొబ్బరి తురుము – ఒక టీ స్పూన్, యాలకుల పొడి – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన జీడిపప్పు పలుకులు – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.

బిస్కెట్ల తయారీ విధానం..
ముందుగా పిండి కలపడానికి తగినన్ని పాలను తీసుకోవాలి. తరువాత వాటిలో పంచదార వేసి కరిగే వరకు కలిపి పక్కకు పెట్టుకోవాలి. తరువాత గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. ఇందులో రవ్వ, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత 3 టేబుల్ స్పూనల్ నూనె, కరిగించిన పాలు పోసి మెత్తగా కలుపుకోవాలి. తరువాత 4 టీ స్పూనల్ పంచదార వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీనిపై మూతను ఉంచి 15 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. 15 నిమిషాల తరువాత పిండిని మరోసారి కలుపుకుని మందంగా ఉండే చపాతీలా రుద్దుకోవాలి. తరువాత అంచులు పదునుగా ఉండే గ్లాస్ లేదా గిన్నెను తీసుకుని బిస్కెట్ల ఆకారంలో కట్ చేసుకోవాలి.
తరువాత ఈ బిస్కెట్లపై నచ్చిన ఆకారంలో చాకుతో గీతలు పెట్టుకోవాలి. తరువాత వీటిపై జీడిపప్పు పలుకులపు వేసి ఊడిపోకుండా కొద్దిగా లోపలికి వత్తుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న బిస్కెట్లను వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బిస్కెట్లు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల నెలరోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ బిస్కెట్లను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇలా బిస్కెట్లను ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు.