Black Pepper For High BP : ప్రస్తుత కాలంలో 100 లో 40 మంది బీపీ సమస్యతో బాధపడుతున్నారు. యువత, నడివయస్కుల వారు కూడా ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతున్నారు. బీపీని సైలెంట్ కిల్లర్గా వైద్యులు అభివర్ణిస్తున్నారు. కారణాలేవైనప్పటికి ఈ సమస్య కారణంగా కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వైద్యులు సూచించిన మందులు వాడినప్పటికి అలాగే ఉప్పును తక్కువగా తీసుకోవడం, మానసిక ఆందోళనకు దూరంగా ఉండడం వంటి తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కొందరిలో బీపీ ఎప్పుడూ నియంత్రణలో ఉండదు. ఇలా బీపీ ఎప్పుడూ ఎక్కువగా ఉండడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రక్తనాళాలు ముడుచుకునే గుణం ఎక్కువయ్యి సాగే గుణం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి.
రక్త నాళాలు ఎంత ఎక్కువగా సాగితే అంత సులువుగా గుండె మీద భారం పడకుండా శరీరంలో రక్తప్రసరణ సాగుతుంది. రక్తనాళాల గోడలకు ఉండే మెత్తటి కండరాలు గట్టి పడడం వల్ల రక్తనాళాలు ఎక్కువగా ముడుచుకుపోతుంటాయి. రక్తనాళాల గోడలకు ఉండే ఈ మెత్తటి కండరాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకు వస్తేనే బీపీ కొంత నియంత్రణలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆహార నియమాలతో పాటు మిరియాలను కూడా వాడడం వల్ల కండరాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుని బీపీ నియంత్రణలోకి వస్తుందని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. మెత్తటి కండరాలు గట్టి పడకుండా చేయడంలో ఈ మిరియాలు ఉపయోగపడుతున్నాయని స్లోవేకియా దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
మిరియాలను మన రోజూ వారి ఆహారంలో తీసుకోవడం పెద్ద సమస్య కూడా కాదు. రోజుకు రెండు నుండి మూడు గ్రాముల మిరియాలను తీసుకోవడం వల్ల బీపీ నియంత్రణలోకి వస్తుందని వారు చెబుతున్నారు. వీటిలో ఉండే పెప్పరిన్ అనే రసాయన సమ్మేళనం మెత్తటి కండరాలు గట్టి పడకుండా చేయడంలో అలాగే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా, పూడికలు ఏర్పడకుండా చేయడంలో దోహదపడుతుంది. బీపీతో బాధపడే వారు ఆహార నియమాలను పాటిస్తూనే మిరియాలను కూడా వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. మిరియాలను దోరగా వేయించి పొడిగా చేసుకోవాలి.
ఈ పొడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఈ మిరియాల పొడిని సలాడ్స్, మొలకెత్తిన గింజలు, కూరలపైన చల్లుకుని తీసుకోవచ్చు. అలాగే ఈ మిరియాల పొడి అన్నం మొదటి ముద్దలో కలిపి తీసుకోవచ్చు. ఇలా మిరియాల పొడిని తీసుకోవడం వల్ల 5 నుండి 6 వారాల్లో రక్తనాళాల్లో మెత్తటి కండరాలు సులువుగా సాగుతాయని దీంతో బీపీ కొంతమేర వెంటనే నియంత్రణలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.