Biscuits Without Maida And Oven : పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చిరుతిళ్లల్లో బిస్కెట్లు కూడా ఒకటి. బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మనకు షాపుల్లో, బేకరీలల్లో, సూపర్ మార్కెట్ లలో వివిధ రకాల బిస్కెట్లు లభిస్తూ ఉంటాయి. అలాగే మనం ఇంట్లో కూడా ఈ బిస్కెట్లను విరివిరిగా తయారు చేస్తూ ఉంటాము. బిస్కెట్లను మైదాపిండితో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. కేవలం మైదాపిండితోనే కాకుండా మనం గోధుమపిండితో కూడా ఎంతో రుచిగా ఉండే బిస్కెట్లను తయారు చేసుకోవచ్చు. గోధుమపిండితో చేసే బిస్కెట్లను తినడం వల్ల ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది. అలాగే ఇంట్లో ఒవెన్ లేకపోయినా సరే ఈ బిస్కెట్లను సులభంగా తయారు చేసుకోవచ్చు. గోధుమపిండితో రుచికరమైన బిస్కెట్లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బిస్కెట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, రవ్వ – ఒక కప్పు, ఉప్పు – చిటికెడు, సోంపు గింజలు – ఒక టీ స్పూన్, యాలకుల పొడి – పావు టీ స్పూన్, ఎండు కొబ్బరి తురుము – అర కప్పు, నెయ్యి – పావు కప్పు, పంచదార – అర కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బిస్కెట్ల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో రవ్వ వేసి కలపాలి. తరువాత నెయ్యి, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత నెయ్యి వేసి కలపాలి. నెయ్యి వేసి కలిపిన తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. పిండిని చక్కగా కలుపుకున్న తరువాత ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బిస్కెట్ల ఆకారంలో వత్తుకోవాలి. ఈ బిస్కెట్లపై మనకు కావల్సిన ఆకారంలో డిజైన్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బిస్కెట్లను వేసి వేయించాలి. ఈ బిస్కెట్లను చిన్న మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బిస్కెట్లు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇలా ఇంట్లోనే గోధుమపిండితో రుచికరమైన బిస్కెట్లను తయారు చేసుకుని తినవచ్చు. ఈ బిస్కెట్లను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.