Biyyam Pindi Appalu : బియ్యం పిండితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసే ఎటువంటి వంటకమైన చాలా రుచిగా ఉంటాయి. బియ్యంతో మనం చేసుకోదగిన వంటకాల్లో బియ్యంపిండి అప్పాలు కూడా ఒకటి. బియ్యం పిండి అప్పాలు అనగానే చాలా మంది తియ్యటి అప్పాలు అనుకుంటారు. తియ్యటి అప్పాలతో మనం బియ్యంపిండితో కారం అప్పాలను కూడా తయారు చేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసి చేసే ఈ కారం అప్పాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. బియ్యం పిండితో అప్పాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం పిండి అప్పాల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – ఒక కప్పు, పచ్చిమిర్చి – 5, పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ – 1, వెల్లుల్లి రెబ్బలు – 5, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, నీళ్లు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, నువ్వులు – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, కారం – పావు టీ స్పూన్.

బియ్యం పిండి అప్పాల తయారీ విధానం..
ముందుగా జార్ లో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో మూడు టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇందులోనే ఉప్పు, నువ్వులు, జీలకర్ర పొడి, కారం వేసి కలిపి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం పిండిని వేసి ఉండలు లేకుండా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ బియ్యం పిండిని చల్లారే వరకు ఉంచాలి. పిండి చల్లారిన తరువాత చేత్తో బాగా కలుపుతూ ముద్దలా చేసుకోవాలి. తరువాత పిండిని నాలుగు భాగాలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో భాగాన్ని తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో మందంగా ఉండే చపాతీలా వత్తుకోవాలి.
ఇలా వత్తుకున్న తరువాత అంచు పదునుగా ఉండే చిన్న గిన్నెతో వత్తుకుంటూ గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని కట్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తరువాత అప్పాలను వేసి వేయించాలి. వీటిని వేసిన వెంటనే కదపకుండా కొద్దిగా కాలే వరకు అలాగే ఉంచాలి. అప్పాలు కొద్దిగా కాలిన తరువాత అటూ ఇటూ కదుపుతూ మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బియ్యంపిండి అప్పాలు తయారవుతాయి. ఈ అప్పాలు మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. తీపి రుచిని ఇష్టపడని వారు ఈ విధంగా బియ్యంపిండితో అప్పాలను తయారు చేసుకుని తినవచ్చు బియ్యంపిండితో ఈ విధంగా తయారు చేసిన అప్పాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.