Nutmeg With Milk : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. నిద్రలేమి కారణంగా మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. నిద్రలేమికి అనేక కారణాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన, ఎక్కువగా ప్రయాణించడం, వాతావరణ మార్పులు, మనం తీసుకునే ఆహారం, ఎక్కువగా టీవీ, కంప్యూటర్ వంటి వాటిని చూడడం, ఇతర అనారోగ్య సమస్యలకు వాడుతున్న మందులు, శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం ఇలా నిద్రలేమికి అనేక కారణాలు ఉంటాయి. మనం రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే రాత్రి పూట చక్కగా నిద్రించడం చాలా అవసరం. కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల మనం చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చు.
చక్కటి నిద్రను సొంతం చేసుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రించే ముందు మన చుట్టు పక్కల ఎటువంటి శబ్దం లేకుండా చేసుకోవాలి. అలాగే నిద్రించే స్థలం, దిండు, మనం ధరించిన దుస్తులు కూడా మన నిద్రపై ప్రభావాన్ని చూపుతాయి. కనుక మనకు అనువుగా ఉండే దుస్తులను ధరించడం, మనం వాడే దిండ్లు, పరుపులు మెత్తగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. అలాగే నిద్రించే ముందు మనం తీసుకునే ఆహారం వల్ల కూడా నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. మనం నిద్రించడానికి రెండు గంటల ముందే మనం ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే మనం నిద్రించే గదిలో ఎక్కువగా వెలుతురు లేకుండా చూసుకోవాలి. అలాగే నిద్రించే ముందు లేదా సాయంత్రం పూట ఎక్కువగా వ్యాయామాలు చేయకూడదు.
టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్ వంటి వాటిని ఎక్కువగా చూడకూడదు. ఆందోళన, ఒత్తిడి తగ్గేలా ధ్యానం, యోగా వంటివి చేయాలి. ఈ చిట్కాలను పాటిస్తూనే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ పువ్వు, చిటికెడు జాజికాయ పొడి కలిపి తీసుకోవాలి. జాజికాయ నిద్ర పట్టేలా చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు ఈ విధంగా పాలను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మనం ప్రతిరోజూ 7 నుండి 8 గంటల పాటు తప్పకుండా నిద్ర పోవాలి. శరీరానికి తగినంత నిద్రించకపోవడం వల్ల రోజంతా నీరసంగా ఉంటుంది. అలాగే మెదడు పనితీరు దెబ్బతింటుంది. మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక మనం శరీరానికి తగినంత నిద్రించడం చాలా అవసరం. ఈ చిట్కాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.