Bobbatlu : ఏదైనా పండగ వచ్చిందంటే చాలు మనం రకరకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో బొబ్బట్లు కూడా ఒకటి. బొబ్బట్లను ఇష్టపడని వారు ఉండరు అంటే అతి అతిశయోక్తి కాదు. అంత రుచిగా బొబ్బట్లు ఉంటాయి. చాలా మంది ఈ బొబ్బట్లను తయారు చేయడానికి మైదా పిండిని ఉపయోగిస్తూ ఉంటారు. మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో వంటరాని వాళ్లు కూడా చేసుకోవడానికి సలుభంగా ఉండేలా రుచిగా బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బొబ్బట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, నీళ్లు – అర కప్పు లేదా తగినన్ని, నెయ్యి – అర కప్పు, పసుపు – పావు టీ స్పూన్, శనగపప్పు – ముప్పావు కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు లేదా తగినంత, యాలకుల పొడి – అర టీ స్పూన్.
బొబ్బట్ల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులోనే ఉప్పును, నీటిని వేసి మెత్తగా కలుపుకోవాలి. తరువాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. తరువాత పసుపును వేసి అంతా కలిసేలా మరోసారి బాగా కలపాలి. చివరగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కలిపి మూత పెట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఇందులో రెండు కప్పుల నీటిని పోసి ఒక గంట పాటు నానబెట్టాలి. తరువాత ఈ పప్పును నీటితో సహా కుక్కర్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పును, పసుపును వేసి మూత పెట్టి 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
తరువాత మూత తీసి నీరు అంతా పోయేలా పప్పును వడకట్టుకోవాలి. ఇలా ఉడికించిన పప్పును జార్ లోకి తీసుకుని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో బెల్లం తురుమును, మిక్సీ పట్టుకున్న శనగపప్పు మిశ్రమం వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. ఇందులోనే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి బెల్లం, శనగపప్పు మిశ్రమం అంతా కలిసి ముద్దలా అయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. తరువాత యాలకుల పొడి వేసి కలిసి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి.
శనగపప్పు మిశ్రమం చల్లగా అయిన తరువాత మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. అలాగే చేతికి నెయ్యిని రాసుకుంటూ మనకు కావల్సిన పరిమాణంలో పూర్ణం ముద్దలను చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరోసారి బాగా కలుపుకోవాలి. దీనిని కూడా పూర్ణం ముద్దల కంటే తక్కువగా పరిమాణంలో ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ ను లేదా బటర్ పేపర్ ను తీసుకుని దానిపై నెయ్యిని రాయాలి. తరువాత గోధుమ పిండి ముద్దను తీసుకుని కొద్దిగా పలుచగా వత్తుకోవాలి.
తరువాత అందులో పూర్ణం ముద్దను ఉంచి అంచులతో మూసి వేయాలి. దీనిపై నెయ్యిని వేస్తూ చేత్తో బొబ్బట్లుగా వత్తుకోవచ్చు. చేత్తో వత్తడం రానీ వారు పైన కూడా మరో పాలిథీన్ కవర్ ను లేదా బటర్ పేపర్ ను ఉంచి చపాతీ కర్రతో పలుచగా బొబ్బట్లను రుద్దాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక బొబ్బట్టును వేసి కాల్చుకోవాలి. దీనిని నెయ్యి వేస్తూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో కమ్మగా ఉండే బొబ్బట్లు తయారవుతాయి. ఈ విధంగా చేసిన బొబ్బట్లను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ బొబ్బట్ల తయారీలో గోధుమ పిండిని ఉపయోగిస్తున్నాం. కనుక ఆరోగ్యానికి కూడా ఎటువంటి హాని కలగదు.