Borugula Upma : బొరుగులు.. ఇవి మనందరికీ తెలుసు. వడ్ల నుండి వీటిని తయారు చేస్తారు. వీటిని కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. బరువు తగ్గడంలో ఇవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ బొరుగులతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటారు. బొరుగులతో మనం ఎంతో రుచిగా ఉండే ఉప్మాను కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని ఉగ్గాణి అని కూడా అంటారు. బొరుగులతో ఎంతో రుచిగా ఉండే ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బొరుగుల ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
బొరుగులు – 100 గ్రాములు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పుట్నాల పొడి – రెండున్నర టేబుల్ స్పూన్స్, శనగ పప్పు – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, చిన్నగా తరిగిన టమాట – 1, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెబ్బ, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్ లేదా తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బొరుగుల ఉప్మా తయారీ విధానం..
ముందుగా బొరుగులను నీటిలో వేసి నానబెట్టి నీళ్లు లేకుండా చేత్తో పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఉప్పును, కారాన్ని, పుట్నాల పొడిని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత శనగ పప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత కరివేపాకు, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. తరువాత టమాట ముక్కలను వేసి కలిపి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను, పసుపును వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
ఇప్పుడు ముందుగా ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న బొరుగులను వేసి అంతా కలిసేలా బాగా కలిపి 3 నుండి 5 నిమిషాల పాటు ఉంచాలి. చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బొరుగుల ఉప్మా తయారవుతుంది. దీనిని పచ్చి ఉల్లిపాయలు, నిమ్మ రసంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ బొరుగుల ఉప్మాను ఉదయం అల్పాహారంలో భాగంగా లేదా సాయంత్రం సమయంలో స్నాక్స్ గా కూడా తినవచ్చు. ఎక్కువ నూనెను ఉపయోగించి చేసే పదార్థాలను తినడానికి బదులుగా ఇలా బొరుగుల ఉప్మాను చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.