Butter Chicken : మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీలలో బటర్ చికెన్ కూడా ఒకటి. బటర్ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీలో చికెన్ ముక్కలు జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. రోటీ, నాన్, బటర్ నాన్ వంటి వాటితో తినడానికి ఈ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. మనలో చాలా మంది ఇప్పటికే ఈ కర్రీని రుచి చూసే ఉంటారు.ఈ బటర్ చికెన్ ను అదే రుచితో అదే చక్కటి రంగుతో మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా ఈ కర్రీని చాలా తేలికగా చేయవచ్చు. రెస్టారెంట్ స్టైల్ లో బటర్ చికెన్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బటర్ చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బటర్ – 4 టీ స్పూన్స్, బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క ముక్కలు – 2, లవంగాలు – 3, యాలకులు – 2, సాజీరా – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్,తరిగిన పచ్చిమిర్చి – 2, నీళ్లు – ఒక కప్పు, ధనియాల పొడి -ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ – 3 టీ స్పూన్స్.
పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బటర్ – 3 టీ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన టమాటాలు – 2, జీడిపప్పు – 2 టీ స్పూన్స్, కొత్తిమీర – కొద్దిగా, పుదీనా – కొద్దిగా.
మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
చికెన్ – 400 గ్రా., ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 లేదా 3 టీ స్పూన్స్, కాశ్మీరి కారం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పెరుగు – 4 టీ స్పూన్స్, నిమ్మరసం – అర చెక్క, కసూరి మెంతి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్.
బటర్ చికెన్ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో బటర్ వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత టమాట ముక్కలు, జీడిపప్పు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత కొత్తిమీర, పుదీనా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తరువాత జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో బటర్ వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి కలపాలి.
దీనిని 5 నిమిషాల పాటు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలిపి మూత పెట్టాలి. దీనిని మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలపాలి. చివరగా ప్రెష్ క్రీమ్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బటర్ చికెన్ తయారవుతుంది. దీనిని రోటీ, అన్నం, నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఇంట్లోనే రుచిగా బటర్ చికెన్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.