Cauliflower Curry : కాలీఫ్లవర్ ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కాలీఫ్లవర్ లో కూడా మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. దీనితో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా అందరూ ఇష్టంగా తినేలా రుచిగా కాలీఫ్లవర్ పొటాటో కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాలీఫ్లవర్ పొటాటో కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
కాలీఫ్లవర్ – పావు కిలో, ఉడికించిన బంగాళాదుంప – 1, ఉడికించిన పచ్చి బఠాణీ – పావు కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 1, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 (మధ్యస్థంగా ఉన్నది), అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
కాలీఫ్లవర్ కూర తయారీ విధానం..
ముందుగా కాలీఫ్లవర్ ను ముక్కలుగా చేసుకోవాలి. తరువాత వీటిని వేడి నీటిలో వేసి రెండు నిమిషాల పాటు ఉడికించి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులను వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయముక్కలను వేసి ఎర్రగా అయ్యే వరకు కలుపుతూ వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
తరువాత కాలీఫ్లవర్ ముక్కలను వేసి అంతా కలిసేతా కలపాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలిపి మూత పెట్టాలి. ఈ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించిన తరువాత ఉడికించిన బఠాణీ గింజలను, అలాగే ఉడికించిన బంగాళాదుంపను మెత్తగా చేసుకుని వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా కలిపి మూడు నిమిషాల పాటు వేయించాలి. తరువాత గరం మసాలా పొడిని వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ పొటాటో కూర తయారవుతుంది. చపాతీ, రోటీ, పుల్కా, అప్పం వంటి వాటితో ఈ కూరను కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన కాలీఫ్లవర్ పొటాటో కూరను కూడా అందరూ ఇష్టంగా తింటారు.