Chandrakala Sweet : మనకు స్వీట్ షాపుల్లో లభించే లభించే తీపి పదార్థాల్లో చంద్రకళ స్వీట్స్ కూడా ఒకటి. ఈ స్వీట్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని కోవా పూరీ అని కూడా అంటారు. చాలా మంది ఈ స్వీట్స్ ను ఇష్టంగా తింటారు. స్వీట్ షాప్ స్టైల్ ఈ చంద్రకళ స్వీట్స్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా తేలిక. స్పెషల్ డేస్ లో, పండగలకు ఇలా ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చులో చంద్రకళ స్వీట్స్ ను తయారు చేసి తీసుకోవచ్చు. ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ చంద్రకళ స్వీట్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చంద్రకళ స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి – చిటికెడు, బేకింగ్ పౌడర్ – పావు టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, పంచదార – ఒక కప్పు, నీళ్లు – అర కప్పు, కుంకుమ పువ్వు – చిటికెడు, నిమ్మరసం – 3 చుక్కలు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
కోవా తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కటి పాలు – ఒక లీటర్, పంచదార – పావు కప్పు, నిమ్మరసం – 4 నుండి 5 చుక్కలు, యాలకుల పొడి – అర టీస్పూన్, చిన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా.
చంద్రకళ స్వీట్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పాలు పోసి కలుపుతూ వేడి చేయాలి. పాలు బాగా మరిగి దగ్గర పడిన తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత నిమ్మచుక్కలు వేసి కలపాలి. పాలు విరిగి పలుకులుగా అయిన తరువాత యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కోవా చల్లారిన తరువాత ఉండలుగా చేసుకోవాలి. తరువాత గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో యాలకుల పొడి, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మెత్తగా కలుపుకుని మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత కుంకుమ పువ్వు వేసి కలుపుతూ ఉడికించాలి. పంచదార మిశ్రమం జిగురుగా అయిన తరువాత నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిపై మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాతపిండిని తీసుకుని సమానంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
తరువాత వీటిని పూరీలా వత్తుకోవాలి. ఇప్పుడు ఒక్కో షీట్ ను తీసుకుని దానిపై పాలకోవా ఉండను ఉంచాలి. తరువాత అంచుల చుట్టూ నీళ్లతో తడి చేయాలి. దీనిపై మరో షీట్ ను ఉంచి అంచులను గట్టిగా వత్తాలి. తరువాత అంచులను గుండ్రంగా చుట్టుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కొద్దిగా వేడయ్యాక వత్తుకున్న చంద్రకళలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపైరెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించి గంటెలోకి తీసుకోవాలి. తరువాత వీటిని పంచదార పాకంలో వేసి 2 నుండి 3 నిమిషాల పాటు ఉంచి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చంద్రకళ స్వీట్స్ తయారవుతాయి. ఇలా ఇంట్లోనే చాలా సులభంగా స్వీట్ షాపు స్టైల్ చంద్రకళ స్వీట్స్ ను తయారు చేసి తీసుకోవచ్చు.