Chettinad Masala Egg Fry : మనం కోడిగుడ్డును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కోడిగుడ్డు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కోడిగుడ్డుతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్డుతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో చెట్టినాడు మసాలా ఎగ్ ఫ్రై కూడా ఒకటి. ఈ ఎగ్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. నిమిషాల వ్యవధిలోనే ఈ ఎగ్ ఫ్రైను మనం తయారు చేసుకోవచ్చు. అలాగే దీనిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేయవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ చెట్టినాడు మసాలా ఎగ్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చెట్టినాడు మసాలా ఎగ్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన పెద్ద ఉల్లిపాయలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, సోంపు గింజలు – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, పచ్చిమిర్చి – 3, ఎండుమిర్చి -2, నూనె – 3 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉప్పు – తగినంత, ఉడికించిన కోడిగుడ్లు – 5, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చెట్టినాడు మసాలా ఎగ్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, సోంపు గింజలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మిరియాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ నీళ్లు పోసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత కోడిగుడ్లను నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత నెమ్మదిగా మరో వైపుకు తిప్పుకోవాలి. మరో 4 నిమిషాల పాటు వేయించిన తరువాత మరో వైపుకు తిప్పుకుని మరో 3 నిమిషాల పాటు వేయించాలి.
తరువాత కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చెట్టినాడు మసాలా ఎగ్ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఎగ్ ఫ్రైను తయారు చేసుకుని తినడం వల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కోడిగుడ్డుతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.