Chicken Fry Piece Biryani : చికెన్ తో మనం రకరకాల బిర్యానీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే వివిధ రకాల బిర్యానీల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఒకటి. ఇది ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అచ్చం రెస్టారెంట్ లలో లభించే విధంగా అదే రుచితో ఈ బిర్యానీని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
చికెన్ – ఒక కిలో, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా పొడి – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, కసూరి మెంతి – 2 టీ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెబ్బ.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క, లవంగాలు – 2, యాలకులు – 4, అనాస పువ్వు – 1, చిన్న బిర్యానీ ఆకు – 1, జాపత్రి – 1, మిరియాలు – అర టీ స్పూన్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, శొంఠి ముక్క – 1 (అర ఇంచు ముక్క), గసగసాలు – ఒక టీ స్పూన్, జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్.
చికెన్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 4 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, తరిగిన పచ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, పెద్ద టమాట – 1, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన పుదీనా – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బాస్మతి బియ్యం – ముప్పావు కిలో, నూనె – 3 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – 1, యాలకులు – 2, లవంగాలు – 3, మరాఠి మొగ్గ – 1, బిర్యానీ ఆకు – 1, సాజీరా – ఒక టీ స్పూన్, అనాస పువ్వు – 1, మరాఠి మొగ్గ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, నీళ్లు – నాలుగున్నర గ్లాసులు లేదా తగినన్ని, ఉప్పు – తగినంత.
చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో మారినేషప్ కు కావల్సిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి. దీనిపై మూతను ఉంచి అర గంట పాటు పక్కకు ఉంచుకోవాలి. తరువాత ఒక జార్ లో మసాలా పొడికి కావల్సిన పదార్థాలన్నింటినీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పసుపు, కారం, పెరుగు వేసి కలపాలి.
దీనిని నిమిషం పాటు వేయించిన తరువాత టమాటాను ఫ్యూరీగా చేసి వేసుకోవాలి. తరువాత బాగా కలిపి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి కలపాలి. దీనిపై మూతను ఉంచి 15 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత మూతను తీసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చికెన్ ఉడుకుతుండగానే మరో స్టవ్ మీద అడుగు భాగం మందంగా ఉండే కళాయిని లేదా కుక్కర్ ను ఉంచాలి. ఇందులో నూనెను వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులను వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పచ్చిమిర్చిని వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తరువాత కరివేపాకు, పుదీనా, కొత్తమీర వేసి వేయించాలి.
తరువాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి కలుపుతూ 5 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత నీటిని, ఉప్పును వేసి కలిపి ఉడికించాలి. ఇప్పుడు చికెన్ పూర్తిగా ఉడికి దగ్గరపడిన తరువాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు అన్నంలోని నీరు అంతా పోయి అన్నం 50 శాతం వరకు ఉడికిన తరువాత దానిపైన ఉడికించిన చికెన్ వేసి ఆవిరి పోకుండా మూత పెట్టాలి. దీనిని చిన్న మంటపై 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ బిర్యానీ గిన్నెను పది నిమిషాల పాటు అలాగే ఉంచిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అచ్చం రెస్టారెంట్ లలో లభించే విధంగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారవుతుంది. ఉల్లిపాయ, నిమ్మరసంతో కలిపి తింటే ఈ ఫ్రై పీస్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది.