Chickpea Salad : శనగలను మనం తరచూ వంటింట్లో వాడుతూ ఉంటాం. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. శనగలల్లో ఫైబర్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. శరీరానికి కావల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ శనగలల్లో ఉంటాయి. మాంసాహారం తినలేని వారు శనగలను తినడం ద్వారా శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. శనగలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. షుగర్ వ్యాధిని నియంత్రించడంలో శనగలు ఎంతగానో సహాయపడతాయి. శనగలల్లో అధికంగా ఉండే కాల్షియం ఎముకలను ధృడంగా ఉంచడంలో సహాయపడుతుంది. బీపీని నియంత్రించి గుండె జబ్బులు రాకుండా చేయడంలో శనగలు ఉపయోగపడతాయి.

శరీరంలోని వ్యర్థాలను తొలగించి, రోగాల బారిన పడకుండా చేయడంలో శనగలు ఎంతగానో సహాయపడతాయి. శరీరంలోని చెడు కొవ్వు (ఎల్‌డీఎల్) ను తగ్గించడమే కాకుండా అధికంగా ఉన్న బరువును తగ్గించడంలోనూ శనగలు ఉపయోగపడతాయి. శనగలతో మనం రకరకాల వంటలను, సలాడ్స్ ను తయారు చేసుకోవచ్చు. శనగలతో చేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగానే శనగలతో సలాడ్ ను తయారు చేసుకునే విధానాన్ని, తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
శనగల సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగలు – రెండు కప్పులు, పన్నీర్ ముక్కలు – ఒక కప్పు, తరిగిన కీర దోస – ఒక కప్పు, తరిగిన టమాట – ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ – ఒక కప్పు, వేయించిన పల్లీలు – పావు కప్పు, మొలకెత్తిన పెసర్లు- అర కప్పు, తరిగిన కొత్తిమీర – పావు కప్పు, ఆలివ్ నూనె – ఒక టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, ఉప్పు – ఒక టీ స్పూన్, చాట్ మసాలా – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి-పావు టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్.
శనగల సలాడ్ తయారీ విధానం..
ముందుగా శనగలను 7-8 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. తరువాత శనగలను మెత్తగా అయ్యే వరకు కుక్కర్ లో వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఉడికించిన శనగలతోపాటు పైన చెప్పిన పదార్థాలు అన్ని వేసి బాగా కలుపుకోవాలి. దీంతో ఎంతో పుష్టికరమైన శనగల సలాడ్ తయారవుతుంది. అజీర్తి సమస్య ఉన్న వారు శనగలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. దీంతో జీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు. రక్తహీనతతో బాధపడే వారికి శనగలు ఎంతో మేలు చేస్తాయి. శరీరంలో మెటబాలిజాన్ని పెంచి జీవక్రియలను మెరుగుపరచడంలోనూ శనగలు ఎంతగానో సహాయపడతాయి.