Chilly Baby Corn : మనం బేబి కార్న్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బేబి కార్న్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సలాడ్ రూపంలో వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. సలాడ్ గా తీసుకోవడంతో పాటు వీటితో మనం ఎంతో రుచిగా ఉండే చిల్లీ బేబి కార్న్ ను కూడా తయారు చేసుకోవచ్చు. బేబి కార్న్ తో చేసే ఈ వంటకం మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లభిస్తుంది. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఈ చిల్లీ బేబి కార్న్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చిల్లీ బేబి కార్న్ ను ఏవిధంగా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చిల్లీ బేబీ కార్న్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ముక్కలుగా తరిగిన బేబీ కార్న్ – 7, పెటల్స్ లా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, పెటల్స్ లా తరిగిన క్యాప్సికం – 1, టమాట సాస్ – ఒక టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 2 టీ స్పూన్స్, మైదాపిండి – 2 టీ స్పూన్స్, రెడ్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, వెల్లుల్లి తరుగు – ఒక టీ స్పూన్, వెనిగర్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన పచ్చిమిర్చి – 3, మిరియాల పొడి – అర టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
చిల్లీ బేబి కార్న్ తయారీ విధానం..
ముందుగా బేబికార్న్ ను నీటిలో వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత వీటిని నీళ్లు లేకుండా వడకట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మైదా, కార్న్ ఫ్లోర్, అర టీ స్పూన్ సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి పిండి ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బేబి కార్న్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మరో కళాయిలో రెండు టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికం వేసి వేయించాలి.
వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత సోయా సాస్, టమాట సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ లో నీళ్లు పోసి లిక్విడ్ లాగా చేసుకుని వేసుకోవాలి. దీనిని దగ్గర పడే వరకు వేయించిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న బేబి కార్న్ ను వేసి కలపాలి. సాసెస్ అన్నీ బేబి కార్న్ కు పట్టేలా టాస్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చిల్లీ బేబి కార్న్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇలా ఇంట్లోనే చిల్లీ బేబి కార్న్ ను తయారు చేసుకుని తినవచ్చు.