Chinthapandu Pulihora : పులిహోర.. దీనిని తినని వారు ఉండరనే చెప్పవచ్చు. పులిహోరను అందరూ ఇష్టంగా తింటారు. దీనిని మనం తరచూ వంటింట్లో తయారు చేస్తూనే ఉంటాం. చింతపండు, నిమ్మరసం వేసి చేసినప్పటికి గుడిలో కూడా మనకు ప్రసాదంగా పులిహోరను పెడుతుంటారు. చింతపండుతో, నిమ్మరసంతో ఈ పులిహోర తయారు చేసినప్పటికి చింతపండు పులిహోరనే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే పులిహోరకు బదులుగా కింద చెప్పిన విధంగా చేసే పులిహోర మరింత రుచిగా ఉంటుంది. దీనిలో వేసే మసాలా పొడే పులిహోరకు చక్కటి రుచిని తెస్తుంది. చింతపండు పులిహోరను మరింత రుచిగా, చక్కగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పులిహోర తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒకటిన్నర గ్లాసులు, మిరియాలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 4, ధనియాలు – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – 50 గ్రా., నూనె – 4 టీ స్పూన్స్, పసుపు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 4 టీ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, పల్లీలు – 3 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 4, ఆవాలు – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, పసుపు – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్.
పులిహోర తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్లు, ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె వేయాలి. దీనిపై మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పొడి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పసుపు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత నానబెట్టిన చింతపండు నుండి గుజ్జును తీసి వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జులోని నీరు అంతాపోయి గుజ్జు దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో మిరియాలు, ఎండుమిర్చి, ధనియాలు,మెంతులు, ఆవాలు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తగా పొడిగా చేసుకోవాలి.
ఇప్పుడు అన్నంలో ఉడికించిన చింతపండు, మిక్సీ పట్టుకున్న పొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకుని తాళింపు చేసుకోవాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న అన్నంలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పులిహోర తయారవుతుంది. తరచూ చేసే పులిహోర కంటే ఈ విధంగా మసాలా పొడి వేసి చేసిన ఈ పులిహోర మరింత రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఇష్టంగా తింటారు.