Chuduva : అటుకులను సహజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అటుకులను పోహా లేదా మిక్చర్ రూపంలో చాలా మంది తింటారు. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. అటుకులను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. కనుక వీటిని ఎవరైనా సరే చాలా సులభంగా తినవచ్చు. ఇక అటుకులతో చేసే చుడువా కూడా ఎంతో మందికి నచ్చుతుంది. దీన్ని ఎలా తయారు చేయాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల చుడువా తయారీకి కావల్సిన పదార్థాలు..
అటుకులు – అర కిలో, పల్లీలు, పుట్నాల పప్పు – అర కప్పు చొప్పున, జీలకర్ర, ఆవాలు – ఒక టీస్పూన్ చొప్పున, కారం, పసుపు – అర టీస్పూన్ చొప్పున, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – ఆరు, వెల్లుల్లి తురుము – ఒక టీస్పూన్, ఎండు మిర్చి – 3, పచ్చిమిర్చి చీలకలు – 6, కరివేపాకు రెమ్మ – ఒకటి.
అటుకుల చుడువా తయారీ విధానం..
స్టవ్ మీద మందపాటి పాత్ర పెట్టి అటుకులను కలుపుతూ గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కళాయిలో నూనె వేసి వేడెక్కిన తరువాత శనగపప్పు వేయాలి. ఇవి దోరగా వేగాక పుట్నాల పప్పు వేయాలి. దీంట్లోనే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి చీలికలు, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాలి. తరువాత కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, అటుకులు వేసి బాగా కలపాలి. చివరగా వెల్లుల్లి తురుము వేయాలి. రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. దీంతో రుచికరమైన చుడువా తయారవుతుంది. దీన్ని రోజూ సాయంత్రం తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.