Sunnundalu : మినప పప్పును సాధారణంగా మనం తరచూ ఇడ్లీలు, దోశలు వంటి వాటిని.. గారెలను తయారు చేసేందుకు ఉపయోగిస్తుంటాం. ఇది ఎంతో బలవర్ధకమైంది. శక్తిని, పోషకాలను అందిస్తుంది. పోషకాహార లోపం ఉన్నవారు మినప పప్పును పొట్టుతో సహా తింటుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. మినప పప్పు వల్ల ఇంకా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే దీంతో సున్నుండలను కూడా తయారు చేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు.. మనకు అమితమైన శక్తిని అందిస్తాయి. ఇక సున్నుండలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సున్నుండల తయారీకి కావల్సిన పదార్థాలు..
మినప పప్పు – పావు కిలో, పెసర పప్పు – పావు కిలో, బెల్లం – 400 గ్రా., యాలకుల పొడి – ఒక టీస్పూన్, నెయ్యి – 200 గ్రా..
సున్నుండలను తయారు చేసే విధానం..
మందపాటి బాణలిలో నూనె లేకుండా మినప పప్పు, పెసర పప్పులను దోరగా వేయించుకుని పొడి చేయాలి. ఆ పొడిలో బెల్లం పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి. అన్నీ బాగా కలిపిన తరువాత కావల్సిన సైజులో ఉండలు చేయాలి. నెయ్యి వాడకాన్ని తగ్గించాలనుకుంటే నేతిని పిండిలో కలపకుండా చేతికి కాస్త రాసుకుంటూ ఉండలు చేసుకోవాలి. ఇలా సున్నుండలను చాలా సులభంగా తయారు చేయవచ్చు. అయితే మినప పప్పు, పెసర పప్పులను విడిగా వేయించుకుంటే మంచిది. లేదా ముందుగా మినప పప్పును వేసి ఒక మోస్తరుగా వేగిన తరువాత పెసర పప్పును వేయాలి. ఇలా రెండింటినీ వేయించుకుని పొడి చేసి సున్నుండలను తయారు చేయవచ్చు. ఇలా చేసిన సున్నుండలు ఎంతో శక్తిని అందిస్తాయి. వీటిని రోజుకు ఒక్కటి తిన్నా చాలు.. మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.