Cinema Ticket Rates : గత కొద్ది నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలుగు సినీ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై కొత్త జీవో విడుదల కానుంది. దీంతో సినీ ఇండస్ట్రీకి తగినట్లుగా ధరలు పెరగనున్నాయి. ఎన్నో నెలల నుంచి ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్‌కు ఇది నిజంగా శుభవార్తే కానుంది. త్వరలో రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాతలకు ఈ వార్త ఊరటను కలిగించనుంది.
ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై ఇప్పటికే ఓ కమిటీని వేయగా.. ఆ కమిటీ అన్ని వివరాలను పరిశీలించి ఏపీ ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేసింది. అయితే ఈపాటికే కొత్త జీవో విడుదల కావల్సి ఉంది. కానీ ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మరణం కారణంగా ఈ అంశంపై నిర్ణయం వాయిదా పడింది. కానీ ఎట్టకేలకు ఈ సమస్యకు సీఎం జగన్ పరిష్కారం చెప్పనున్నారు. ఆయన కొత్త జీవోపై నేడో రేపో సంతకం చేయనున్నారు. దీంతో సినిమా టిక్కెట్ల ధరలపై ఏపీలో కొత్త జీవో విడుదల కానుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు ఈ వార్త సంతోషాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను చిరంజీవి ఈ మధ్యే కలిశారు. ఆయనతోపాటు ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి కూడా జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. అయితే పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమా తరువాతే ఈ జీవో విడుదలవుతుండడం విశేషం. మార్చి 11న రాధేశ్యామ్, 25వ తేదీన ఆర్ఆర్ఆర్ చిత్రాలు ఉండడంతో ఆయా సినిమాలకు ఈ జీవో ఎంతో ఊరటను కలిగించనుంది. నేడు సాయంత్రం లేదా మంగళవారం వరకు కొత్త జీవో విడుదలవుతుందని ఆశిస్తున్నారు.