Coconut Laddu : సాధారణంగా చాలా మంది సాయంత్రం సమయాల్లో స్నాక్స్ రూపంలో జంక్ ఫుడ్‌ను తింటుంటారు. నూనెతో చేసిన ఆహారాలు, బేకరీ పదార్థాలు, గప్‌చుప్ వంటివి తింటుంటారు. అయితే ఇవి వాస్తవానికి మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి. కనుక వీటిని తినరాదు. వీటికి బదులుగా ఇంట్లోనే ఎంతో రుచికరంగా ఉండేలా మనం వివిధ రకాల పదార్థాలను తయారు చేసుకుని తినవచ్చు.
ఇక వీటిలో ఆరోగ్యకరమైన స్నాక్స్ కూడా ఉంటాయి. వాటిల్లో కొబ్బరి లడ్డూలు కూడా ఒకటి. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు.. మనకు పోషకాలను కూడా అందిస్తాయి. వీటిని రోజుకు ఒకటి తింటే అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక కొబ్బరిలడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..
తాజా కొబ్బరి తురుము – 2 కప్పులు, పాలు – అర కప్పు, చక్కెర – మూడుంపావు కప్పులు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, జీడిపప్పు – గుప్పెడు (చిన్న చిన్న ముక్కలు చేయాలి), నెయ్యి – 1 టీ స్పూన్.
కొబ్బరి లడ్డూలను తయారు చేసే విధానం..
బాణలి తీసుకుని స్టౌ మీద ఉంచి వేడి చేయాలి. అనంతరం అందులో నెయ్యి వేసి కరిగించాలి. అందులో జీడిపప్పు ముక్కలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కొబ్బరి తురుము, చక్కెర వేసి బాగా కలిపి ఉడకబెట్టాలి. మిశ్రమంలో తడి అంతా పోయి గట్టిపడుతుంది. అనంతరం అందులో యాలకుల పొడి, వేయించుకున్న జీడిపప్పు వేసి బాగా కలిపి దింపాలి. ఈ మిశ్రమం మరింత చల్లారాక లడ్డూల మాదిరిగా చేతులతో ఒత్తుకోవాలి. గాలి చొరబడని డబ్బాల్లో ఈ లడ్డూలను నిల్వ చేయాలి.
ఇలా చేసిన లడ్డూలు 2 లేదా 3 రోజుల వరకు మాత్రమే నిల్వ ఉంటాయి. కనుక వీటిని ఎప్పటికప్పుడు చేసుకుని తినవచ్చు. చాలా త్వరగా వీటిని తయారు చేసుకోవచ్చు. కనుక ఒకసారి చేసుకుని 3 రోజుల పాటు నిల్వ ఉంచి తినవచ్చు. తరువాత అవసరాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇవి ఎన్నో పోషకాలను అందించడమే కాక.. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా చేకూర్చుతాయి. కాబట్టి వీటిని రోజుకు ఒకటి తినాలి.