Coconut Payasam : మనం పచ్చి కొబ్బరితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పచ్చి కొబ్బరితో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ కొబ్బరితో కొబ్బరి పచ్చడి, కొబ్బరి అన్నం వంటివి చేయడంతో పాటు తీపి వంటకాల తయారీలో కూడా దీనిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ పచ్చి కొబ్బరితో మనం ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ పాయసాన్ని ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడుగుతుంటారు. పచ్చి కొబ్బరితో రుచిగా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము – ఒక పెద్ద కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్, పాలు – అర లీటర్, పంచదార – 1/3 కప్పు, యాలకుల పొడి -ఒక టీ స్పూన్, కుంకుమ పువ్వు – చిటికెడు.
కొబ్బరి పాయసం తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో బియ్యాన్ని వేసి రవ్వలా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో పచ్చికొబ్బరి తురుమును వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, బియ్యం రవ్వ వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించిన తరువాత పాలు పోసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత పంచదార, యాలకుల, కుంకుమ పువ్వు కలిపిన నీళ్లు పోసి కలపాలి. పంచదార కరిగి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత దీనిపై డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పాయసం తయారవుతుంది. దీనిని చల్లారిన తరువాత తింటే చాలా రుచిగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు లేదా పండుగలకు ఇలా కొబ్బరి పాయసాన్ని తయారు చేసుకుని తినవచ్చు. ఈ పాయసాన్ని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.