Crispy Chicken Pakoda : నాన్ వెజ్ ప్రియులకు చికెన్ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చికెన్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ బిర్యానీ, కూర, పులావ్, తందూర్ వంటి వాటితో పాటు చికెన్ పకోడి వంటి చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. చికెన్ పకోడి చాలా రుచిగా ఉంటుంది. చక్కగా చేయాలే కానీ కరకరలాడుతూ నోట్లో నీళ్లు ఊరేంత రుచిగా ఉంటుంది. ఈ చికెన్ పకోడీని రుచిగా, కరకరలాడుతూ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ చికెన్ పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – 500 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, మైదా పిండి – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, చికెన్ మసాలా – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ప్రైకు సరిపడా, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – రెండు రెమ్మలు.
చికెన్ పకోడి తయారీ విధానం..
ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా వేసి ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఇందులో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, కొద్దిగా నీటిని వేసి కలుపుకోవాలి. తరువాత ఒక టేబుల్ స్పూన్ నూనె, అర చెక్క నిమ్మరసం వేసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై అటూ ఇటూ కదుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
తరువాత అదే నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకుని చికెన్ ముక్కలపై వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ పకోడి తయారవుతుంది. ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసంతో కలిపి తింటే ఈ పకోడి చాలా రుచిగా ఉంటుంది. ఒక్క ముక్క కూడా విడిచి పెట్టకుండా ఇంట్లో అందరూ దీనిని ఇష్టంగా తింటారు. తరచూ చేసే వంటకాలతో పాటు చికెన్ తో అప్పుడప్పుడూ ఇలా పకోడీలను కూడా వేసుకుని తినవచ్చు.