Crispy Chicken Pakoda : మనం చికెన్ తో కర్రీలు, ఫ్రైలు, బిర్యానీ ఇలా రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటుగా చికెన్ తో మనం స్నాక్స్ ను కూడా తయారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసుకోదగిన స్నాక్ రెసిపీలల్లో చికెన్ పకోడి కూడా ఒకటి. చికెన్ పకోడి చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా తినడానికి, స్నాక్స్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. చికెన్ పకోడిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీకెండ్స్ లో లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అప్పుడప్పుడూ ఇలా వేడి వేడిగా చికెన్ పకోడీలను తయారు చేసుకుని తినవచ్చు. క్రిస్పీగా, రుచిగా అందరూ ఇష్టపడేలా చికెన్ పకోడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉప్పు నీటిలో అరగంట పాటు నానబెట్టిన చికెన్ – అరకిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నిమ్మకాయ – 1, ఉప్పు – తగినంత, కారం – 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, తరిగిన కరివేపాకు – 2 రెమ్మలు, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, బియ్యంపిండి – 2 టీ స్పూన్స్, శనగపిండి – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
చికెన్ పకోడి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో చికెన్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి కలుపుకోవాలి. తరువాత ఈ చికెన్ ను కనీసం ఒక గంట పాటు ఫ్రిజ్ లో మ్యారినేట్ చేసుకోవాలి. వీలైతే దీనిని రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ కూడా చేసుకోవచ్చు. గంట పాటు మ్యారినేట్ చేసుకున్న తరువాత చికెన్ ను బయటకు తీసి మరోసారి అంతా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మంటను మధ్యస్థంగా చేసి చికెన్ ను వేసుకోవాలి. ఈ చికెన్ ను అటూ ఇటూ తిప్పుతూ క్రిస్పీగా, ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ పకోడి తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన చికెన్ పకోడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.