Gold Jewellery Cleaning Tips : బంగారు నగలంటే ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఎవరి స్థోమతకు తగినట్టు వారు ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉంటారు. బయటకు వెళ్లినప్పుడు, ఫంక్షన్ లకు వాటిని ధరిస్తూ ఉంటారు. అయితే బంగారు ఆభరణాలను వాడే కొద్ది అవి నల్లగా మారుతూ ఉంటాయి. మనం కొనుగోలు చేసినప్పుడు ఉండే మెరుపు వాడే కొద్ది తగ్గుతూ వస్తుంది. ఎప్పుడో ఒకసారి వేసుకునే ఈ నగలు నల్లగా మారితే చూడడానికి అంత చక్కగా ఉండవని చెప్పవచ్చు. అయితే బంగారు నగలు ఎప్పుడూ మెరుస్తూ ఉండాలంటే వాటిని మనం అప్పుడప్పుడూ శుభ్రం చేస్తూ ఉండాలి. చాలా మందికి బంగారు ఆభరణాలను ఎలా శుభ్రం చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే చిట్కాలను వాడడం వల్ల చాలా సులభంగా బంగారు ఆభరణాలను తళతళ మెరిసేలా చేసుకోవచ్చు.
బంగారు ఆభరణాలను శుభ్రం చేసుకునే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నల్లగా మారిన ఆభరణాలను శుభ్రం చేయడంలో సోప్ వాటర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో బంగారు ఆభరణాలను వేసి అవి మునిగే వరకు సోప్ వాటర్ ను పోయాలి. వీటిని 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత మృదువుగా బ్రష్ తో మెల్లగా రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. తరువాత కాటన్ వస్త్రంతో నెమ్మదిగా తడి పోయేలా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నగలపై పేరుకుపోయిన నలుపు తొలగిపోతుంది.
అలాగే రసాయనాలు తక్కువగా వాడే షాంపులను ఉపయోగించి కూడా మనం నగలను శుభ్రం చేసుకోవచ్చు. రాళ్లు, కెంపులు, పచ్చలు ఉండే ఆభరణాలను షాంపు నీటితో శుభ్రం చేసుకోవడం మంచిది. నీటిలో షాంపు వేసి బాగా కలపాలి. తరువాత ఈ నీటిలో ఆభరణాలను వేసి బ్రష్ తో నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే ఆభరణాలపై నేరుగా షాంపు వేసి నెమ్మదిగా శుభ్రంతో రుద్ది తరువాత నీటితో శుభ్రం చేసుకుని తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల దుమ్ము, ధూళి, మురికి తొలిగిపోయి బంగారు ఆభరణాలు కొత్తవాటిలా మెరుస్తాయి. అదే విధంగా ఆభరణాలను శుభ్రం చేసేటప్పుడు గోరు వెచ్చని నీటిలో ఉపయోగించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
గిన్నెలో బంగారు నగలను వేసి అవి మునిగే వరకు గోరువెచ్చని నీటిని పోయాలి. వీటిని 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆభరణాలపై పేరుకుపోయిన మురికి, దుమ్ము, జిడ్డు వంటివి తొలగిపోతాయి. అయితే ఈ బంగారు ఆభరణాలను శుభ్రం చేసేటప్పుడు చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా శుభ్రం చేయాలి. మృదువైన బ్రష్ నే వాడాలి. అలాగే చాలా నెమ్మదిగా రుద్దుతూ శుభ్రం చేయాలి. మనం శుభ్రం చేసేటప్పుడు ఒక్కోసారి రాళ్లు ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఎక్కువగా రాళ్లు కలిగిన వాటిని ఆభరణాలను శుభ్రం చేసే వారితో శుభ్రం చేయించుకుంటే మంచిది.