Crispy Dondakaya Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయలల్లో దొండకాయలు ఒకటి. వీటిని తినడం వల్ల కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. దొండకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. అయినప్పటికి ఈ దొండకాయలను చాలా మంది ఇష్టంగా తినరు. దొండకాయలను తినని వారు కూడా వదిలి పెట్టకుండా తినేలా వీటితో మనం ఫ్రై ను తయారు చేయవచ్చు. కర్రీ పాయింట్ లలో, క్యాటరింగ్ వారు ఎక్కువగా ఈ ఫ్రైను తయారు చేస్తూ ఉంటారు. దొండకాయలతో రుచిగా, కరకరలాడేలా ఫ్రై ను ఎలా తయారు చేయాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ దొండకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
దొండకాయలు – పావు కిలో, శనగపిండి – 2 టీ స్పూన్స్, మైదా పిండి – 2 టీ స్పూన్స్, బియ్యం పిండి – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – రెండు రెమ్మలు, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్.
క్రిస్పీ దొండకాయ ఫ్రై తయారీ విధానం..
ముందుగా దొండకాయలను నిలువుగా అలాగే సన్నగా తరిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో శనగపిండి, మైదాపిండి, బియ్యంపిండి, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం పేస్ట్ వేసి కలుపుకోవాలి. తరువాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక దొండకాయ ముక్కలను పకోడీలుగా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని వేయించుకున్న తరువాత అదే నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకు, జీడి పప్పు వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత అన్ని కలిసేలా బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల క్రిస్పీ దొండకాయ ఫ్రై తయారవుతుంది. దీనిని పప్పు, చారు, సాంబార్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దొండకాయను ఇష్టపడని వారు ఈ విధంగా చేసిన ఫ్రై చాలా ఇష్టంగా తింటారు. తరచూ చేసే వంటకాలకు బదులుగా ఇలా అప్పుడప్పుడూ దొండకాయలతో ఫ్రై ను తయారు చేసుకుని తినవచ్చు.