Crispy Mushroom Pakora Recipe : పుట్ట గొడుగులను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇవి మార్కెట్ లో అన్ని కాలాల్లోనూ మనకు విరివిరిగా లభ్యమవుతున్నాయి. పుట్ట గొడుగుల్లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. పుట్ట గొడుగులను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో కూరలనే కాకుండా పకోడి వంటి చిరుతిళ్లను కూడా తయారు చేసుకుని తినవచ్చు. పుట్ట గొడుగులతో చేసే పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా కరకరలాడుతూ ఉండేలా పుట్ట గొడుగు పకోడీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మష్రూమ్ పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పుట్ట గొడుగులు – 200 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, కారం – ఒకటిన్నర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, చికెన్ మసాలా – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, శనగపిండి – 3 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, జీడిపప్పు – కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – రెండు రెమ్మలు.

మష్రూమ్ పకోడి తయారీ విధానం..
ముందుగా పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసి కలపాలి. తరువాత శనగపిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్ వేసి తగినన్ని నీళ్లు పోస్తూ పకోడి పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. తరవాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుట్ట గొడుగు ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పుట్ట గొడుగులను ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
పుట్ట గొడుగులు అయిపోగా మిగిలిన మిశ్రమంలో కొద్దిగా నీటిని పోసి పలుచగా చేసుకోవాలి. తరువాత ఇందులో కరివేపాకు, జీడిపప్పు, పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. వీటిని కూడా నూనెలో వేసి వేయించుకుని ముందుగా తయారు చేసిన పకోడీల మీద వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ పకోడి తయారవుతుంది. సాయంత్రం సమయాల్లో ఎంతో రుచిగా ఉండే పకోడీలను స్నాక్స్ గా చేసుకుని తినవచ్చు. పుట్టగొడుగులను తినని వారికి ఇలా పకోడీల రూపంలో వేసి ఇవ్వడం వల్ల వారికి కూడా పుట్ట గొడుగుల్లోని పోషకాలు చక్కగా అందుతాయి.