Dadpe Poha : మనం అటుకులను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. అటుకులతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అటుకులతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. అటుకులతో చేసుకోదగిన వంటకాల్లో పోహా కూడా ఒకటి. ఇది మనందరికి తెలిసిందే. అల్పాహారంగా, స్నాక్స్ గా దీనిని తీసుకుంటూ ఉంటాము. ఈ పోహాను కూడా వివిధ రుచుల్లో తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే పోహా కూడా చాలా రుచిగా ఉంటుంది. మహారాష్ట్ర స్టైల్ లో చేసే ఈ దడ్పే పోహా మరింత రుచిగా ఉంటుందని చెప్పవచ్చు. లంచ్ బాక్స్ లోకి కూడా దీనిని తీసుకెళ్లవచ్చు. ముఖ్యంగా వేసవికాలంలో తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే దడ్పే పోహాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దడ్పే పోహ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు – తగినంత, పంచదార – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – 3 టేబుల్ స్పూన్స్, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్, మందంగా ఉండే అటుకులు – 2 కప్పులు, లేత కొబ్బరి బోండం నీళ్లు లేదా నీళ్లు – 3 టేబుల్ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు.
దడ్పే పోహ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, పంచదార వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలల్లో ఉండే నీరు బయటికి వచ్చేలా బాగా కలపాలి. తరువాత కొత్తిమీర, నిమ్మరసం వేసి కలపాలి. ఇప్పుడు అటుకులు వేసి కలపాలి. తరువాత కొబ్బరి నీళ్లు లేదా సాధారణ నీళ్లు చల్లి కలపాలి. వీటిపై మూత పెట్టి అరగంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో ఆవాలు వేసి వేయించాలి. తరువాత పసుపు, కరివేపాకు వేసి కలపాలి. తాళింపు వేగిన తరువాత దీనిని ముందుగా సిద్దం చేసుకున్న అటుకులల్లో వేసి కలపాలి. ఇందులోనే వేయించిన పల్లీలు, పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దడ్పే పోహ తయారవుతుంది. దీనిని అందరూ ఇష్టంగా తింటారు. అయితే లంచ్ బాక్స్ లోకి తీసుకెళ్లే వారు ఇందులో కొబ్బరి నీళ్లు వాడకపోవడమే మంచిది.