Dahi Egg Masala Curry : పెరుగును మనం నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగును తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చన్న సంగతి మనందరికి తెలిసిందే. పెరుగును భోజనంతో తినడంతో పాటు దీనితో రకరకాల వంటకాలను తయారు చేయడంలో కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటాం. పెరుగును ఉపయోగించి చేసే వంటకాల్లో దహీ ఎగ్ మసాలా కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్ తో పాటు వటరాని వారు కూడా ఈ కూరను చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ దహీ ఎగ్ మసాలా కూరను తయారు చేసుకోవడానికి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దహీ ఎగ్ మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 5, పెరుగు – 200 గ్రా., చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 3, టమాటాలు – 3, జీలకర్ర – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత.
దహీ ఎగ్ కర్రీ తయారీ విధానం..
ముందుగా టమాటాలను ఉడికించి వాటిపై ఉండే పొట్టును తీసి ఫ్యూరీలా చేసుకోవాలి. తరువాత పెరుగులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. తరువాత కళాయిలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చిటికెడు పసుపు, అర టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. తరువాత ఉడికించిన కోడిగుడ్లకు గాట్లు పెట్టి వేసుకోవాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరింత నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాట ఫ్యూరీ వేసి కలపాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత ఇందులో మసాలా కలిపిన పెరుగు వేసి కలపాలి. దీనిని 5 నిమిషాల పాటు చిన్న మంటపై కలుపుతూ వేయించిన తరువాత ఇందులో వేయించిన కోడిగుడ్లు, గరం మసాలా, అరగ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దహీ ఎగ్ మసాలా తయారవుతుంది. దీనిని అన్నం,చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. కోడిగుడ్లను, పెరుగును ఉపయోగించి ఇలా కూరను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.