Lord Krishna : మహా భారత యుద్దం తరువాత శ్రీ కృష్ణుడు ఎలా తన అవతారాన్ని చాలించాడు అనే దాని గురించి మనలో చాలా మందికి తెలిసి ఉండదు. శ్రీ కృష్ణుడి మరణం వెనుక ఆసక్తికరమైన కథ దాగి ఉంది. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర మహా సంగ్రామంలో యోధాను యోధులంతా మరణిస్తారు. కౌరవులంతా ఈ యుద్ధంలో మరణించడంతో యుద్ధ భూమిలో తన బిడ్డలంతా శవాల దిబ్బలుగా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేని గాంధారి తన పుత్రుల మరణానికి మూల కారణమైన శ్రీ కృష్ణుడి యాదవ వంశం నాశనం అయిపోవాలని శపిస్తుంది. కౌరవులపై విజయం సాధించిన పాండవులు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండగా శ్రీ కృష్ణుడు 36 సంవత్సరాల పాటు ద్వారకా నగరంలో తన అష్ట భార్యలతో ఆనందంగా గడుపుతాడు.
ఒకరోజు మహర్షులంతా శ్రీ కృష్ణుడి దర్శనానికై వేచి ఉండగా శ్రీ కృష్ణుడు, జాంబవతిల కుమారుడైన సాంబుడు వారిని ఆట పట్టించాలని భావించి స్త్రీ వేషంలో గర్భవతిగా నటిస్తూ మహర్షుల ముందుకు వచ్చి తన కడుపులో ఉన్నది పాపా, బాబా అని చెప్పమని అడుగతాడు. దివ్య దృష్టితో అంతా తెలుసుకున్న వారు నీ కడుపులో నుండి ముసలం పుడుతుందని అది మీ యాదవుల కులాన్నంతా నాశనం చేస్తుందని శపిస్తారు. మహర్షుల శాపం గురించి తెలుసుకున్న శ్రీ కృష్ణుడు సాంబుడి పొట్ట నుండి బయటకు వచ్చిన రోకలిని అరగదీసి సముద్రంలో కలిపేయాలని చెబుతాడు. శ్రీ కృష్ణుడు చెప్పినట్టుగానే దాన్ని అరగ దీయడం ప్రారంభిస్తారు. దాన్ని అరగదీసి అరగదీసి అలసిపోయిన యాదవులు చివరిక చిన్న ముక్క మిగలడంతో విసుగు వచ్చి దాన్ని సముద్రంలోకి విసిరేస్తారు.
అది కొన్ని రోజులకు సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఓ వేటగాడికి దొరుకుతుంది. దానితో ఆ వేటగాడు బాణాన్ని తయారు చేసుకుంటాడు. తన అవతారం పరి సమాప్తికి సమయం ఆసన్నమైందని భావించిన శ్రీ కృష్ణుడు తన అస్త్ర శస్త్రాలను పరిత్యధించి ప్రభాస తీర్థానికి చేరుకుని అస్త వృక్షం కింద విశ్రమిస్తాడు. కృష్ణుడు ద్వారకా నగరాన్ని విడిచి రాగానే ద్వారక నగరం కొంచెం కొంచెంగా సముద్రంలోకి మునిగిపోవడం మొదలవుతుంది. అస్త చెట్టు కింద శ్రీ కృష్ణుడు తన రెండు కాళ్లను చాపుకుని విశ్రాంతి తీసుకుంటుండగా జింకను తరుముతూ వస్తున్న వేటగాడు దూరం నుండి మెరుస్తున్న శ్రీ కృష్ణుడి పాదం జింక అనుకుని భ్రమించి ముసలంతో తయారు చేసిన బాణాన్ని విడుస్తాడు.
విష పూరితమైన ఆ బాణం కృష్ణుడి పాదాన్ని తాకడంతో అక్కడే తన దేహాన్ని విడుస్తాడు. శ్రీ కృష్ణుడి మరణానికి కారణమైన నిశాదుడే పూర్వజన్మలో శ్రీ రాముడి చాటు నుండి సహరించిన వాలి. శ్రీ కృష్ణుడు ఎంతకు కనబడకపోవడంతో అర్జునుడు గోపాలున్ని వెతుకుతూ వస్తుండగా అస్త వృక్షం కింద శ్రీ కృష్ణుడి పార్ధివ దేహం కనిపిస్తుంది. అప్పటికే కృష్ణుడు మరణించి నాలుగు రోజులు అవ్వడంతో అక్కడే తన సారథితో కలిసి అర్జునుడు శ్రీ కృష్ణుడి అంతిమ సంస్కారాలను నిర్వహిస్తాడు. అంతటితో శ్రీకృష్ణుడి ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమవుతుంది. ఇది క్రీస్తు పూర్వం 3102 ఫిబ్రవరి 17 న జరిగిందని చరిత్ర కారుల అభిప్రాయం. అయితే వ్యాస భారతం ప్రకారం శ్రీ కృష్ణుడు అరణ్యాలకు వెళ్లి అక్కడి నుండి స్వర్గానికి చేరుకున్నాడని రాసి ఉంది. ఇలా కృష్ణుడి మరణం సంభవిస్తుంది. దీని గురించి చాలా మందికి ఇప్పటికీ తెలియదు. కానీ తెలిస్తే ఆశ్చర్యపోతారు.