Kitchen Tips : మనలో చాలా మంది వంటింట్లోకి కావల్సిన పదార్థాలను నెలకు సరిపడా ఒకేసారి కొనుగోలు చేస్తుంటారు. అలాగే రెండు మూడు నెలలకొకసారి కొనుగోలు చేసే వారు కూడా ఉంటారు. ఇలా కొనుగోలు చేసిన పదార్థాలను సరిగ్గా నిల్వ చేసుకోకపోవడం వల్ల అవి పురుగు పట్టడం, పాడవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఆకుకూరలను ఫ్రిజ్ లో నిల్వ చేసుకోకపోవడం వల్ల అవి పాడవడం, బూజు పట్టడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మనం కొనుగోలు చేసే ఆహార పదార్థాలను ఎలా నిల్వ చేసుకోవాలి.. అలాగే మన పని భారాన్ని తగ్గించడంతోపాటు మనకు ఎంతగానో ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనం కరివేపాకు వంటి వాటిని వారానికి సరిపడేలా ఒకేసారి ఇంటికి తెచ్చుకుంటాం. ఇలా తెచ్చుకున్న వాటి నుండి పాడైపోయిన ఆకులను, పండిన ఆకులను లేత ఆకులను కూడా తొలగించి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆర బెట్టుకోవాలి. తరువాత మూత ఉండే డబ్బాలో అడుగున న్యూస్ పేపర్ ను లేదా టిష్యూపేపర్ ను ఉంచి కరివేపాకును కాడల నుండి వేరు చేసి డబ్బాలో ఉంచి మూత పెట్టి ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నెలరోజుల పాటు కూడా కరివేపాకు తాజాగా ఉంటుంది. ఇదే పద్ధతిలో కొత్తిమీర, పుదీనా వంటి ఇతర ఆకుకూరలను కూడా నిల్వ చేసుఏకోవచ్చు.
అలాగే మనం డ్రై ఫ్రూట్స్ ను కూడా కొనుగోలు చేస్తూ ఉంటాం. సరిగ్గా నిల్వ చేసుకోకపోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ కొద్ది రోజులకే ఒకరకమైన వాసన రావడం ప్రారంభమవుతుంది. అలా వాసన రాకుండా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ ను మూత ఉండే గాజు సీసాలో ఉంచి గాలి తగలకుండా గట్టిగా మూత పెట్టి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డ్రైఫ్రూట్స్ వాసన రాకుండా మెత్తగా అవ్వకుండా ఉంటాయి. అలాగే మనం వంటింట్లో మైదా పిండి, శనగ పిండి, బియ్యం పిండి, కారం, ధనియా లపొడి వంటి వాటిని కూడా నిల్వ చేసుకుంటూ ఉంటాం. చాలా మంది వీటిని పురుగు పట్టకుండా ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా వీటిని గాజు సీసాలో పోసి పప్పు గుత్తి లేదా స్పూన్ వంటి వాటితో మధ్య మధ్యలో గాలిలేకుండా లోపలికి గట్టిగా వత్తాలి.
ఇలా చేయడం వల్ల పిండి, పొడి వంటివి తాజాగా పురుగుపట్టకుండా చాలా రోజుల వరకు ఉంటాయి. అలాగే పాలను గిన్నెలో పోసి మరలా మరలా వేడి చేయడం వల్ల అడుగ భాగంలో పేరుకుపోయి శుభ్రం చేయడానికి ఇబ్బంది అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ముందుగా పాలను వేడే చేసే గిన్నెలో కొద్దిగా నీటిని పోసి 5 నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత నీళ్లను పారబోసి అదే గిన్నెలో పాలను పోసి వేడి చేసుకోవడం వల్ల అడుగు భాగం పేరుకుపోకుండా ఉండి శుభ్రం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. అదే విధంగా మనం వంటింట్లో బొండాలు, బజ్జీల వంటి ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. అయితే అవి నూనెను ఎక్కువగా పీల్చి తినడానికి వీలే లేకుండా కూడా అవుతూ ఉంటాయి.
అలాంటప్పుడు మనం ఇలాంటి ఆహార పదార్థాలను తయారు చేసేటప్పుడు పిండిలో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసి తయారు చేసుకోవడం వల్ల మనం చేసే పదార్థాలు నూనెను ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి. అలాగే ఒక్కోసారి వడ, బొండాలు వంటి పదార్థాలను తయారు చేసేటప్పుడు అవి నూనెలో వేయగానే పేలిపోతుంటాయి. ఇలా పేలుతున్నాయంటే వాటిని తయారు చేసే పిండిలో నీటి శాతం ఎక్కువగా ఉందని అర్థం. అలాంటప్పుడు మరుగుతున్న నూనెలో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి ఫ్రై చేయడం వల్ల నూనె చిందకుండా ఉంటుంది. అదే విధంగా మనలో చాలా మంది డీఫ్ ఫ్రై చేయగా మిగిలిన నూనెను తాజా నూనెతో కలిపేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నూనె పాడైపోతుంది. డీప్ ఫ్రై చేయగా మిగిలిన నూనెను వేరే డబ్బాలో పోసుకుని వంటల్లో ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల నూనె పాడవకుండా ఉండడంతోపాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది.
అదే విధంగా మనం మిక్సీ పట్టేటప్పుడు అప్పుడప్పుడూ కొన్ని పదార్థాలు చింది మిక్సీ మీద పడడం, జార్ అడుగు భాగంలో ఇరుక్కుపోవడం, గోడలపై పడడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక గిన్నెలో వంటసోడాను, వెనిగర్ ను, సర్ఫ్ ను తీసుకుని ఈ మూడింటిని బాగా కలపాలి. తరువాత ఒక కాటన్ వస్త్రంతో కానీ, బ్రష్ తో కానీ శుభ్రం చేసుకోవడం వల్ల మొండి మరకలు తొలగిపోతాయి. ఒక్కోసారి మిక్సీ జార్ లో బ్లేడ్ లు పదును తగ్గిపోయి పదార్థాలు మెత్తగా అవ్వవు. అలాంటప్పుడు జార్ లో రాళ్ల ఉప్పును, లేదా ఐస్ క్యూబ్స్ ను వేసి 5 నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల జార్ లో బ్లేడ్స్ పదునుగా అవ్వడంతోపాటు జార్ కూడా శుభ్రం అవుతుంది.
అలాగే మనం దోశలు వేయడానికి ఎక్కువగా నాన్ స్టిక్ తవాలను ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఇవి కొద్ది రోజులకే సరిగ్గా పని చేయకుండా అయిపోతాయి. నాన్ స్టిక్ తవాలు ఎక్కువ రోజులు పని చేయాలంటే వాటిని తరచూ స్ర్కబర్ తో శుభ్రం చేయకూడదు. దోశలు వేయడం అవ్వగానే తవా చల్లారిన తరువాత టిష్యూ పేపర్ తో శుభ్రం చేసుకుని దుమ్ము పడకుండా భద్రపరుచుకోవాలి. మరలా ఉపయోగించే ముందు తవాను మరోసారి టిష్యూ పేపర్ తో శుభ్రం చేసుకుని ఉపయోగించాలి. అలాగే దోశ వేసేటప్పుడు అతుక్కుపోకుండా దానిపై ఉల్లిగడ్డను రుద్ది దోశ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నాన్ స్టిక్ తవాలు ఎక్కువ కాలం పాటు మన్నుతాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల పదార్థాలు పాడవకుండా ఉండడంతోపాటు మనకు పని చేయడం కూడా సులభతరం అవుతుంది.