Garika : మన చుట్టూ ఇంటి చుట్టూ పరిసరాల్లో అనేక రకాల మొక్కలు ఉంటాయి. ఈ మొక్కల్లో ఉండే ఔషధ గుణాలు తెలియక వాటిని మనం కలుపు మొక్కలుగా భావిస్తూ ఉంటాం. అలాంటి వాటిల్లో గరిక కూడా ఒకటి. గరికను దాదాపుగా అందరూ చూసే ఉంటారు. వినాయకుడికి గరిక అంటే మహా ప్రీతి. వినాయకుడి పాదాల వద్ద నాలుగు గరిక పోచలను ఉంచి భక్తితో నమస్కరిస్తే చాలు. మన మనసులోని కోరికను వెంటనే నెరవేరుస్తాడు. వినాయకుడికి గరికను సమర్పించడం వెనుక ఒక కథ కూడా ఉంది.
పూర్వం అగ్నిస్వరూపమైన అనలాసురుడు అనే రాక్షసుడు కనిపించిన ప్రతి వస్తువును దహించి వేసేవాడట. ఇతడి కళ్లు స్వర్గలోకంపై పడడంతో ఇంద్రుడు వినాయకుడి వద్దకు వెళ్లి రాక్షసుడి బారి నుండి కాపాడమని వేడుకున్నాడట. దీంతో వినాయకుడు భారీ కాయంతో విరాట్ రూపాన్ని ధరించి అనలాసురుడనే రాక్షసుడిన్ని మింగేశాడట. అగ్ని స్వరూపుడైన అనలాసురుడుని మింగేసినందుకు వినాయకుడి కడుపులో మంట మొదలవుతుంది. దీంతో వినాయకుడి బాధను తగ్గించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాకపోయే సరికి ఋషులు వచ్చి వినాయకుడి తలపైన 21 గరికలు ఉంచడంతో ఒంట్లో వచ్చిన తాపం మొత్తం తగ్గుతుంది. అప్పుడు వినాయకుడు సంతోషించి ఎవరైతే నన్ను గరికతో పూజిస్తారో వారి కోరికలన్నీ నెరవేరుస్తానని గరికకు వరమిచ్చాడట.
అలా గరికకు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. గ్రహణ సమయంలో కూడా గరికను వినియోగిస్తారు. కేవలం పూజ కోసం మాత్రమే కాకుండా ఔషధంగా కూడా గరికను ఉపయోగిస్తారు. ఆయుర్వేద వైద్యంలో మన పూర్వీకులు గరికను ఎంతోకాలంగా వినియోగిస్తున్నారు. గరిక వేర్లను మెత్తగా నూరి అందులో పసుపును కలిపి చర్మానికి లేపనంగా రాసుకోవడం వల్ల దద్దుర్లు, దురదలు, అలర్జీ వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. గరిక ఆకులను పచ్చడిగా చేసుకుని అన్నంతో కలిపి తినడం వల్ల ఒంటి నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. గరికను మెత్తగా నూరి గాయాలపై లేపనంగా రాయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. ఈ విధంగా గరికె మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.