Number Plates : సాధారణంగా మన దేశంలో ఏ వాహనానికి అయినా సరే అది రిజిస్టర్ అయిన ప్రాంతాన్ని బట్టి నంబర్ ప్లేట్ ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన వాహనాలకు ఆ రాష్ట్రం అక్షరాలు ముందుగా నంబర్ ప్లేట్‌పై వస్తాయి. తరువాత జిల్లా, అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్ వస్తాయి. ఇలాగే ఏ రాష్ట్రంలోని వాహనాలకు అయినా సరే నంబర్లను కేటాయిస్తారు. అయితే ఆర్మీ వాహనాలకు మాత్రం నంబర్ ప్లేట్లు భిన్నంగా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారు. ఇక ఆ వాహనాల నంబర్ ప్లేట్లపై పలు అక్షరాలు, చిహ్నాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే వాటి అర్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చిత్రంలో ఇచ్చిన ఆర్మీ వాహనం నంబర్ ప్లేట్‌పై అక్షరాలను మీరు గమనించారు కదా. ఆ నంబర్ ప్లేట్‌పై ముందుగా పైకి సూచించే బాణం చిహ్నం ఉంది. ఇలా ఎందుకు రాస్తారంటే.. వాహనం ఎప్పుడైనా దురదృష్టవశాత్తూ తిరగబడినప్పుడు నంబర్ ప్లేట్‌పై ఉండే అంకెలు లేదా అక్షరాలు రివర్స్‌లో కనిపిస్తాయి కదా. అలాంటప్పుడు వాటిని తప్పుగా చదివేందుకు అవకాశం ఉంటుంది. కానీ నంబర్ ప్లేట్ పై ముందుగా బాణం చిహ్నం పైకి ఉంది కనుక ఆ దిశలో ఆ నంబర్లను చదవాలన్నమాట. దీంతో నంబర్లను తప్పుగా చదివేందుకు అవకాశం ఉండదు. కనుక తప్పు జరగకుండా చూసుకోవచ్చు. అందుకనే ఆ వాహనాల నంబర్ ప్లేట్‌పై ముందుగా మనకు బాణం చిహ్నం కనిపిస్తుంది.
ఇక నంబర్ ప్లేట్‌పై బాణం చిహ్నం తరువాత ఉన్న 08కి అర్థం ఏమిటంటే.. ఆ వాహనాన్ని 2008లో కొనుగోలు చేశారని అర్థం. అలాగే తరువాత వచ్చే B అనే అక్షరం వాహన రకాన్ని సూచిస్తుంది. అంటే B అక్షరం ఉన్న వాహనాలను రవాణాకు వాడుతారన్నమాట. అదే అక్కడ B కి బదులుగా A అనే అక్షరం ఉంటే అలాంటి వాహనాలు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అని అర్థం. ఇక అదే స్థానంలో C అనే అక్షరం ఉంటే అలాంటి వాహనాలను తవ్వకాల కోసం లేదా క్రేన్లుగా వాడుతారని అర్థం.
ఇక నంబర్ ప్లేట్‌పై తరువాత ఉన్న 101161 అనే అంకెలు ఆ వాహన సీరియల్ నంబర్‌ను సూచిస్తాయి. తరువాత ఉన్న W అనే అక్షరం చెకింగ్ కోడ్‌గా పనిచేస్తుంది. ఇలా ఆర్మీ వాహనాల నంబర్ ప్లేట్లపై ఉండే అక్షరాలు, అంకెలను మనం అర్థం చేసుకోవచ్చు.