Doodh Peda Recipe : పాలతో చేసే తీపి వంటకాల్లో దూద్ పేడా కూడా ఒకటి. స్వీట్ షాపుల్లో ఇది మనకు ఎక్కువగా లభ్యమవుతుంది. దూద్ పేడా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా, మెత్తగా ఉంటుంది. ఈ దూద్ పేడాను మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు కానీ దీనిని తయారు చేయడానికి సమయం ఎక్కువగా పడుతుంది. అందరికి వీలు కాకపోవచ్చు కూడా. కానీ అదే రుచితో అప్పటికప్పడు ఇన్ స్టాంట్ గా కూడా మనం దూద్ పేడాను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన దూద్ పేడా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇన్ స్టాంట్ గా దూద్ పేడాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దూద్ పేడా తయారీకి కావల్సిన పదార్థాలు..
పాల పొడి – 2 కప్పులు, పంచదార – అర కప్పు, పాలు – అర కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, కొకొవా పౌడర్ – 2 టీ స్పూన్స్, నెయ్యి – 2 టీ స్పూన్స్.
దూద్ పేడా తయారీ విధానం..
ముందుగా ఒక నాన్ స్టిక్ కళాయిని లేదా అడుగు భాగం మందంగా ఉండే కళాయిని తీసుకోవాలి. కళాయిలో పాల పొడి, పాలు, పంచదారను వేసుకోవాలి. ఈ కళాయిని స్టవ్ మీద ఉంచి మధ్యస్థ మంటపై కలుపుతూ వేడి చేయాలి. కొద్ది సేపటి తరువాత పంచదార కరిగి పాలపొడితో చక్కగా కలిసిపోతుంది. ఈ పాలపొడిని అలాగే ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. కొద్ది సేపటి తరువాత పాల పొడి మిశ్రమం దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తరువాత ఇందులో నెయ్యి వేసి కలపాలి. కొద్ది సమయం తరువాత పాలపొడి మిశ్రమం కళాయికి అంటుకోకుండా కళాయి నుండి వేరవుతుంది.
అప్పుడు ఈ పాల పొడి మిశ్రమం నుండి సగం మిశ్రమాన్ని తీసుకుని వేరే ప్లేట్ లో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కళాయిలో ఉన్న మిగిలిన మిశ్రమంలో కొకొవా పొడిని వేసి బాగా కలిపి దీనిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుంటూ పాలపొడి మిశ్రమం నుండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అలాగే కొకొవా మిశ్రమాన్ని కూడా చేతికి నెయ్యికి రాసుకుంటూ తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఈ రెండు ఉండలను కలిపి ఒకే ఉండగా చుట్టుకుని వేలితో మధ్యలో కొద్దిగా వత్తుకోవాలి.
తరువాత దీనిపై డ్రై ఫ్రూట్స్ ను ఉంచి గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దూద్ పేడా తయారవుతుంది. ఈ విధంగా కొకొవా పౌడర్ ను వేసి చేయడం వల్ల దూద్ పేడ రుచిగా ఉండడంతో పాటు చూడడానికి చక్కగా ఉంటుంది. కొకొవా పౌడర్ ను వేసుకోకుండా కూడా ఈ దూద్ పేడాను తయారు చేసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు అలాగే పండుగలకు ఇలా ఎంతో రుచిగా ఉండే దూద్ పేడాను తయారు చేసుకుని తినవచ్చు.