Ginger For Cough : వాతావరణం మారినప్పుడల్లా మనలో చాలా మంది దగ్గుతో ఇబ్బంది పడుతుంటారు. వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల వల్ల ఈ దగ్గు వస్తుంది. దగ్గు శరీరంలో ఉండే అలర్జీలను సూచిస్తుంది. ముక్కు, నోటి ద్వారా ఊపిరితిత్తులకు ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. దగ్గు అంటు వ్యాధి కూడా. దగ్గు కారణంగా ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాం. మనతో పాటు ఇతరులకు కూడా ఈ దగ్గు ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ దగ్గు నుండి ఉపశమనాన్ని పొందడానికి చాలా మంది దగ్గు సిరప్ లను తాగుతూ ఉంటారు. వీటి వల్ల లాభం కంటే దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మనకు వివిధ రకాల దగ్గు మందులు మార్కెట్ లో లభిస్తున్నాయి.
వీటిలో ఏది నకిలిదో, ఏది అసలైందో గుర్తించడం కష్టంగా మారింది. మనల్ని ఎంతో వేధించే ఈ దగ్గును ఇంటి చిట్కా ద్వారా మనం తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా తయారీలో మనం ఉపయోగించే పదార్థాలన్నీ సహజ సిద్దమైనవే. కనుక ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అలాగే దగ్గు నుండి ఉపశమనాన్ని కూడా పొందవచ్చు. దగ్గును తగ్గించే ఇంటి చిట్కా గురించి అలాగే దీనిలో వాడే పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేయడానికి మనం అల్లం, తేనె, నిమ్మరసాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే. జీర్ణక్రియను మెరుగుపరిచే ఎన్నో ఔషధాల్లో అల్లాన్ని విరివిరగా ఉపయోగిస్తారు.
అల్లాన్ని వాడడం వల్ల దగ్గు, జులుబు, విరోచనాలు, వాంతులు, అజీర్తి వంటి అనేక సమస్యల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. దగ్గును తగ్గించడంలో నిమ్మకాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో శరీరాన్ని, చర్మాన్ని ఉత్తేజపరిచే గుణాలు చాలానే ఉన్నాయి. అలాగే స్వచ్ఛమైన తేనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. తేనెను ఉపయోగించడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ముందుగా అల్లాన్ని తీసుకుని శుభ్రపరచాలి. తరువాత వాటిని ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక నిమ్మకాయను తీసుకుని శుభ్రంగా కడిగి నిమ్మకాయను పొట్టుతో సహా తురమాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అల్లం ముక్కలను, నిమ్మకాయ తురుమును వేసి మరిగించాలి.
తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇందులో తేనెను వేసి కలపాలి. మరలా దీనిలో కొద్దిగా నిమ్మరసాన్ని వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్రతిరోజూ రెండు గంటలకొకసారి ఈ మిశ్రమాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో 5 సంవత్సరాల లోపు పిల్లలకు తాగించాలి. అలాగే ఒకటిన్నర టీ స్పూన్ మోతాదులో 12 సంవత్సరాల లోపు పిల్లలకు తాగించాలి. అదేవిధంగా 12 సంవత్సరాల పై బడిన వారు రెండు టీ స్పూన్ల మోతాదులో రెండు గంటలకొకసారి తాగుతూ ఉండాలి. ఈ విధంగా ఈ చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల మనం దగ్గు నుండి సత్వర ఉపశమనాన్ని పొందవచ్చు.