Dosa Avakaya Pachadi : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో దోసకాయ ఒకటి. దోసకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దోసకాయతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. దోసకాయలతో మనం ఎక్కువగా పప్పు, కూర, పులుసు, పచ్చడి వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా దోసకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే ఆవకాయ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. మనకు కర్రీ పాయింట్ లలో, క్యాటరింగ్ లలో ఈ పచ్చడిని ఎక్కువగా సర్వ్ చేస్తూ ఉంటారు. ఈ పచ్చడిని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే దోసకాయ ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దోస ఆవకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి దోసకాయలు – 2, ఆవపిండి – అర గ్లాస్, వెల్లుల్లి రెబ్బలు – 8, కారం – ముప్పావు గ్లాస్, ఉప్పు – పావు గ్లాస్, నూనె – ఒక గ్లాస్.
దోస ఆవకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా దోసకాయలను శుబ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత వాటిని మధ్యలోకి కట్ చేసి వాటిలో ఉండే గింజలను తీసేయాలి. తరువాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను ఒక గ్లాస్ తో కొలుస్తూ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దోసకాయ ముక్కలను ఏ గ్లాస్ తో అయితే కొలుస్తామో అదే గ్లాస్ తో పావు గ్లాస్ ఉప్పు, అర గ్లాస్ ఆవపిండి, ముప్పావు గ్లాస్ కారం వేసి కలపాలి. తరువాత కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి. ఇప్పుడు అదే గ్లాస్ తో ఒక గ్లాస్ నూనె పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి ఒక రోజంతా ఊరబెట్టాలి. పచ్చడి ఊరి నూనె పైకి తేలిన తరువాత మరోసారి కలుపుకుని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఈ పచ్చడి రెండు నెలల వరకు తాజాగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోస ఆవకాయ పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దోసకాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.