Dosa Batter : మనలో చాలా మంది ఇష్టంగా తినే అల్పాహారాలలో దోశలు కూడా ఒకటి. దోశలను తయారు చేయడం చాలా సులభం. అలాగే మనకు రోడ్ల పక్కన బండ్ల మీద, హోటల్స్ లో కూడా ఈ దోశలు విరివిరిగా లభిస్తాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంతో తింటూ ఉంటారు. మనం ఇంట్లో కూడా రకరకాల దోశలను తయారు చేస్తూ ఉంటాము. అయితే చాలా మంది తరచూ దోశలను తయారు చేసినప్పటికి కొన్ని సార్లు దోశలు రుచిగా ఉండవు. కొన్నిసార్లు దోశలు మెత్తగా వస్తూ ఉంటాయి. ఒక్కోసారి దోశ పిండి చక్కగా పులవదు.
మనం ఎంతో రుచిగా ఉండే దోశలను సులభంగా తయారు చేసుకుని తినాలంటే ముందుగా దోశపిండి చక్కగా ఉండాలి. దోశ పిండి సరిగ్గా ఉంటేనే దోశలు రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. రుచికరమైన క్రిస్పీ దోశల కోసం దోశ పిండిని ఎలా తయారు చేసుకోవాలి..దోశలకు కావల్సిన పప్పు, బియ్యాన్ని ఏ కొలతలతో తీసుకోవాలి.. ఈ పిండితో క్రిస్పీ దోశలను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దోశ పిండి తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపగుళ్లు – ఒక కప్పు, రేషన్ బియ్యం లేదా దోశ బియ్యం – రెండు కప్పులు, మెంతులు – ఒక టీ స్పూన్, అటుకులు – ఒక కప్పు.
దోశ పిండి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినపగుళ్లను, మెంతులను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టాలి. తరువాత బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టాలి. అటుకులను పిండి రుబ్బడానికి 10 నిమిషాల ముందు నానబెట్టాలి. పప్పు, బియ్యం చక్కగా నానిన తరువాత ఒక జార్ ను తీసుకుని అందులో ముందుగా మినపగుళ్లను వేసి తగినన్ని నీళ్లు మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో బియ్యం, అటుకులు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బియ్యంపిండిని ముందుగా తయారు చేసుకున్న మినపప్పు పిండిలో వేసి బాగా కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి. ఇలా చేయడం వల్ల దోశ పిండి తయారవుతుంది. ఈ దోశ పిండితో దోశను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పిండి చక్కగా పులిసిన తరువాత తగినంత పిండిని గిన్నెలోకి తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు పక్కకు తీసిన పిండిలో తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేసి బట్టతో లేదా టిష్యూ పేపర్ తో తుడుచుకోవాలి. తరువాత తగినంత పిండిని తీసుకుని దోశ లాగా వేసుకోవాలి. దోశ తడి ఆరిన తరువాత నూనె వేసి కాల్చుకోవాలి. దోశ ఒక వైపు చక్కగా కాలిన తరువాత మరో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. దోశ రెండు వైపులా చక్కగా కాలిన తరువాత దీనిని ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ దోశను ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల రుచిగా, క్రిస్పీగా ఉండే దోశ పిండి తయారవుతుంది. ఇలా తయారు చేసిన దోశలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.