Dosakaya Pachadi : దోసకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. బరువు తగ్గడంలో కూడా ఇవి మనకు ఎంతగానో సహాయపడతాయి. ఈ దోసకాయలతో మనం కూరలతో పాటు పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాము. దోసకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ పచ్చడిని అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. అందరికి నచ్చేలా మరింత రుచిగా ఈ దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ పచ్చడి తయారీకి కాల్సిన పదార్థాలు..
తరిగిన దోసకాయ – 200 గ్రా., నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, పల్లీలు – 3 టేబుల్ స్పూన్, నూనె -ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టీస్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 10 లేదా తగినన్ని, వెల్లుల్లి రెబ్బలు – 4, నువ్వులు -ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన ఉల్లిపాయ – 1.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు- ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు- ఒక రెమ్మ, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4.
దోసకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పల్లీలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుతూ వేయించాలి. ఇవి చక్కగా వేగిన తరువాత నువ్వులు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కళాయిలో మరో టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత దోసకాయ ముక్కలు, చింతపండు వేసి వేయించాలి. దోసకాయ ముక్కలు 50 శాతం ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత జార్ లో వేయించిన దినుసులను తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత ఇందులోనే వేయించిన దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోసకాయ పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో అల్పాహారాలతో కూడా తినవచ్చు. ఈ దోసకాయ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.