Egg Fry : ఉడికించిన కోడిగుడ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. శరీరానికి కావల్సిన పోషకాలన్నింటిని అందించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, బరువు తగ్గడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, రక్తహీనతను తగ్గించడంలో మనకు కోడిగుడ్లు సహాయపడతాయి. ఉడికించిన కోడిగుడ్లను చాలా మంది నేరుగా తింటూ ఉంటారు. నేరుగా తినడంతో పాటు ఉడికించిన కోడిగుడ్లతో మనం ఎంతో రుచిగా ఉండే ఫ్రైను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఉడికించిన కోడిగుడ్లతో రుచిగా ప్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్డు ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 3, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
కోడిగుడ్డు ప్రై తయారీ విధానం..
ముందుగా ఉడికించిన కోడిగుడ్లను ముక్కలుగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత కోడిగుడ్డు ముక్కలను వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఉడికించిన కోడిగుడ్లతో ఫ్రైను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.