Egg Fry : మన శరీరానికి ఎంతో మేలు చేసే ఆహారాల్లో కోడిగుడ్డు ఒకటి. కోడిగుడ్డును తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని తెలిసిందే. రోజూ ఒక ఉడికించిన కోడిగుడ్డును తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. ఉడికించిన కోడిగుడ్డును నేరుగా తినడంతో పాటు దానితో వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఉడికించిన కోడిగుడ్లతో రుచితో, సులభంగా ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 3, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 3, తరిగిన పచ్చిమిర్చి – 4, వెల్లుల్లి రెబ్బలు – 10, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – చిటికెడు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఎగ్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో వెల్లుల్లుఇ రెబ్బలు, ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత మూత పెట్టి మగ్గించాలి. ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా వేగిన తరువాత అందులో ఉడికించిన కోడిగుడ్లకు గాట్లు పెట్టి వేసుకోవాలి. వీటిని మరో నిమిషాల పాటు నూనెలో వేయించాలి. తరువాత పసుపు, మిక్సీ పట్టుకున్న కారం వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రై తయారవుతుంది. ఈ ఎగ్ ఫ్రైను అందరూ విడిచిపెట్టకుండా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఎగ్ ఫ్రైను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు కోడిగుడ్డులోని పోషకాలను, కోడిగుడ్డును తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.