Delhi Style Puri Curry : మనలో చాలా మంది పూరీలను ఎంతో ఇష్టంగా తింటారు. మనకు టిపిన్ సెంటర్లల్లో లభించడంతో పాటు ఈ పూరీలను మనం ఇంట్లో కూడా అప్పుడప్పుడూ తయారు చేస్తూ ఉంటాం. ఈ పూరీలను తినడానికి మనం వివిధ రకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. పూరీలల్లోకి రుచిగా, అలాగే సులభంగా చేసుకోగలిగేలా పూరీ కర్రీని ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ల్లో ఎలా చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీ స్టైల్ పూరీ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 4 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, సోంపు గింజలు – అర టీ స్పూన్, దంచిన ధనియాలు – ఒక టీ స్పూన్, వాము – పావు టీ స్పూన్ కంటే తక్కువ, ఇంగువ – రెండు చిటికెలు, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, తరిగిన పచ్చిమిర్చి – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – ముప్పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్స్, ఆమ్ చూర్ పొడి – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన పెద్ద టమాటాలు – 2, ఉప్పు – తగినంత, నీళ్లు – పావు కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు – 3, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఢిల్లీ స్టైల్ పూరీ కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, సోంపు గింజలు, ధనియాలు, వాము, ఇంగువ వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు సగానికి పైగా వేగిన తరువాత పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఆమ్ చూర్ పొడి, పసుపు వేసి కలపాలి. వీటిని నూనె పైకి తేలే వరకు వేయించుకున్న తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత నీళ్లు పోసి టమాట ముక్కలు మరీ మెత్తగా అయ్యే వరకు వేయించాలి.
తరువాత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు బంగాళాదుంపలను మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ముక్కలు ఉండేలా నలిపి వేసుకోవాలి. తరువాత అంతా కలిసేలా బాగా కలపాలి. బంగాళాదుంప మిశ్రమం పూర్తిగా దగ్గర పడిన తరువాత 350 ఎమ్ ఎల్ నీళ్లు పోసి కలపాలి. వీటిని 8 నిమిషాల పాటు ఉడికించిన తరువాత కసూరి మెంతి, కొత్తిమీర వేసి కలపాలి. తరువాత మంటను చిన్నగా చేసి నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఢిల్లీ స్టైల్ పూరీ కర్రీ తయారవుతుంది. దీనిని పూరీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరతో తింటే ఎన్ని పూరీలు తిన్నారో తెలియకుండా తినేస్తారు.