Ancestors In Dreams : సాధారణంగా ఎవరికైనా చనిపోయిన తమ పూర్వీకులు, పెద్ద వారు కలలో కనిపించడం సహజమే. అయితే ఇలా వారు కలలో కనిపిస్తే దానికి అనుగుణంగా ఒక్కొక్కరు ఒక్కో అర్థం చెబుతుంటారు. చనిపోయిన వారికి కర్మలు సరిగ్గా చేయలేదేమో, అందుకే వారు కలలో కనిపిస్తున్నారు అని ఒకరంటారు. ఇంకొందరైతే చనిపోయిన వారికి మీరంటే బాగా ప్రేమ ఉందేమో, లేదంటే ద్వేషం ఉందేమో అందుకే తరచూ కలలోకి వస్తున్నారు అని అంటారు. మరికొందరు ఇంకా వేరే ఏవో కారణాలు చెబుతారు. అయితే మీకు తెలుసా.. చనిపోయిన వారు అలా కలలోకి రావడం వెనుక వేరే అర్థాలు దాగి ఉన్నాయని. అవును, మేం చెబుతోంది నిజమే. మరి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందామా..?
హిందూ సాంప్రదాయంలో ఒక్కో వర్గం వారు తమ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా చనిపోయిన వ్యక్తులకు 15 రోజుల లోపు కర్మ కాండలు పూర్తి చేస్తారు. అంతేకాదు నెలకోసారి మాసికం, ఏడాదికోసారి సంవత్సరీకం చేసి చనిపోయిన వారిని తలచుకుంటూ కర్మలు చేస్తే దాంతో వారి ఆశీస్సులే కాదు, చనిపోయిన పూర్వీకుల ఆశీస్సులు కూడా సదరు కుటుంబాలకు కలుగుతాయట. అగ్ని పురాణం, గరుడ పురాణం, వాయు పురాణంలలో దీని గురించి రాసి ఉంది. ఈ క్రమంలో అలా కర్మలు చేసే కుటుంబాలకు అంతా మంచే జరుగుతుందట.
ఎవరైనా వ్యక్తులు ఏదైనా యాక్సిడెంట్లోనో, లేదంటే ప్రకృతి విపత్తులోనో మృతి చెందకుండా సహజ సిద్ధంగా మరణిస్తే అలాంటి వ్యక్తుల కుటుంబాలకు చనిపోయిన వారి పూర్వీకుల ఆశీస్సులు మెండుగా ఉంటాయట.
ఎవరికైనా కలలో పాములు కనబడితే చనిపోయిన వారి పూర్వీకుల ఆశీస్సులు వారికి బలంగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అంతే కాదు ఆ పూర్వీకులు కూడా ఏదో ఒక లోకంలో సుఖంగా ఉన్నట్టు బతికి ఉన్నవారు అనుకోవాలి. కర్మలు చేసే సమయంలో ఎవరికైనా అనుకోకుండా ధనం కలసి వచ్చినా, ఎప్పటి నుంచో అనుకుంటున్న కార్యాలు నెరవేరినా, కొత్త వ్యాపారాలు ప్రారంభించినా అదంతా చనిపోయిన వారి పూర్వీకుల ఆశీస్సుల వల్లే అని అర్థం చేసుకోవాలి.
చనిపోయిన వారు కలలో ఆనందంగా ఉన్నట్టు, ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తే అప్పుడు ఆ కలలు వచ్చిన వారికి అంతా మంచే జరుగుతుందట. ఎవరైనా వ్యక్తులు ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు అనుకోకుండా ఎవరైనా పెద్దవారు తోడ్పాటునందిస్తే అప్పుడు వారు చనిపోయిన తమ పూర్వీకుల ఆశీస్సుల వల్లే ఇలా జరిగిందని తెలుసుకోవాలి. తల్లిదండ్రులు, తోడ బుట్టిన వారితో సరిగ్గా మెలుగుతూ వారిని బాగా చూసుకుంటున్న వారికి కూడా చనిపోయిన పెద్దల ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయట.