Fenugreek Plants Growing : మనం మెంతికూరను కూడా ఆహారంగా తీసుకుంటాము. మెంతికూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, బాలింతలల్లో పాల ఉత్పత్తిని పెంచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, షుగర్ ను తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా మెంతికూర మనకు సహాయపడుతుంది. దీనితో ఎక్కువగా మెంతికూర పప్పు, మెంతి పరోటా, మెంతి టమాట కూర ఇలా రకరకాల వంటకాలను వండుతూ ఉంటాము. సాధారణంగా మనం మెంతికూరను మార్కెట్ నుండి కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాము. అసలు బయట కొనే పని లేకుండా ఈ మెంతికూరను మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. మెంతికూరను పెంచడం చాలా సులభం.
ఒకటి లేదా రెండు కుండీలు, ట్రేలు పెట్టుకునే స్థలం ఉంటే చాలు ఈ మెంతికూరను మనం పెంచుకోవచ్చు. సాధారణంగా మనం మట్టి, ఎరువును ఉపయోగించి మెంతికూరను పెంచుతూ ఉంటాము. కానీ మట్టి, ఎరువుల అవసరం లేకుండా కూడా మనం మెంతికూరను పెంచుకోవచ్చు. కేవలం ఇసుక ఉంటే చాలు మనకు కావల్సినంత మెంతికూరను మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఇసుకలో మెంతికూరను ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం మనకు కావల్సినని మెంతులను నీటిలో వేసి ఒక రోజంతా నానబెట్టాలి. తరువాత కుండీలు, ప్లాస్టిక్ బాటిల్స్, ట్రేలు ఇలా మనకు అందుబాటులో ఉన్న వాటిని తీసుకుని వాటికి కింద రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. తరువాత వాటిలో సన్నగా ఉండే ఇసుకను తీసుకుని నీటితో తడపాలి. ఈ ఇసుకను కుండీల్లో, బాటిల్స్ లో నింపాలి. తరువాత ఇసుకపై నానబెట్టిన మెంతులను చల్లాలి.
వీటిపై మరి కొద్దిగా ఇసుకను చల్లుకోవాలి. తరువాత ఇసుకపై కొద్దిగా నీటిని చల్లుకోవాలి. ఇసుక త్వరగా ఎండిపోతుంది కనుక ఎప్పుడూ తడి ఉండేలా చూసుకోవాలి. అలాగే వీటిని తక్కువ ఎండ తగిలే ప్రదేశంలో ఉంచాలి. వీలైతే తడి ఆరిపోకుండా వీటిపై తడిపిన వస్త్రాన్ని కప్పి ఉంచాలి. అలాగే రోజూ నీటిని చల్లుతూ ఉండాలి. మెంతుల నుండి మొలకలు రాగానే వస్త్రాన్ని తీసేసి ఎండ తగిలే చోట ఉంచాలి. 4 నుండి 5 రోజులల్లో మొలకల నుండి ఆకులు రావడం కూడా జరుగుతుంది. ఈ మొలకలకు కూడా రోజూ నీటిని చల్లుతూ ఉండాలి. ఇలా 10 నుండి 15 రోజుల్లో మనకు మెంతికూర అందుబాటులోకి వస్తుంది. ఈ మెంతికూర మరీ పెద్దగా ఉండదు. మనం వంటల్లో వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా సులభంగా మెంతికూరను ఇంట్లోనే పెంచుకోవచ్చు.