Garlic Mushrooms | ప్రస్తుత తరుణంలో కాలంతో సంబంధం లేకుండా లభించే ఆహార పదార్థాలలో పుట్ట గొడుగులు ఒకటి. పుట్టగొడుగుల వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పుట్టగొడుగులల్లో క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ అందడంతోపాటు సులువుగా బరువు తగ్గుతారు. వీటిల్లో విటమిన్ డి, ఫైబర్, సెలీనియం, థయామిన్, మెగ్నిషియం, ఫాస్పరస్, జింక్ అధికంగా ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలు, ఆల్జీమర్స్, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడకుండా చేయడంలో పుట్టగొడుగులు ఎంతో సహాయపడతాయి.
ఇతర ఆహార పదార్థాలతో కలిపి లేదా నేరుగా కూడా పుట్టగొడుగులతో ఎంతో రుచికరమైన వంటలను తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగా వెల్లుల్లి, పుట్టగొడుగులను కలిపి గార్లిక్ మష్రూమ్స్ ను తయారు చేసుకోవచ్చు. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
గార్లిక్ మష్రూమ్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పుట్ట గొడుగులు – రెండు కప్పులు, తరిగిన ఉల్లిపాయలు – ఒక కప్పు, తరిగిన వెల్లుల్లి- పావు కప్పు, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, బటర్ – 100 గ్రాములు, నూనె – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత.
గార్లిక్ మష్రూమ్స్ తయారు చేసే విధానం..
ముందుగా కడాయిలో నూనె, బటర్ వేసి కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇవి కొద్దిగా వేగాక పుట్టగొడుగులు వేసి వీటిలో ఉండే నీరు అంతా పోయే వరకు వేయించాలి. తరువాత తరిగిన వెల్లుల్లి, మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి మరో 10 నిమిషాల పాటు వేయించి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గార్లిక్ మష్రూమ్స్ వంటకం రెడీ అవుతుంది. ఇలా చేయడం వల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. పుట్ట గొడుగులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య నుండి బయట పడవచ్చు. అంతేగాక ఆల్జీమర్స్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలాగే శరీరానికి విటమిన్ బి12, విటమిన్ డి లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రక్తహీనత నుంచి బయట పడేస్తాయి. ఎముకలను దృఢంగా ఉంచుతాయి. వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. కనుక పుట్టగొడుగులను రుచికరంగా కావాలనుకుంటే ఇలా వండుకుని తినవచ్చు. దీంతో రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండూ లభిస్తాయి.