Ghee Mysore Pak : మనకు స్వీట్ షాపుల్లో లభించే తీపి పదార్థాల్లో ఘీ మైసూర్ పాక్ ఒకటి. మైసూర్ పాక్ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మైసూర్ పాక్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. చాలా మంది ఈ ఘీ మైసూర్ పాక్ ను ఇంట్లో తయారు చేసుకోలేమని భావిస్తూ ఉంటారు. కానీ ఈ ఘీ మైసూర్ పాక్ ను మనం అదే రుచితో ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఘీ మైసూర్ పాక్ ను ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఘీ మైసూర్ పాక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – ఒక కప్పు, పంచదార – 2 కప్పులు, నెయ్యి – ఒక కప్పు, నూనె – ఒక కప్పు.
ఘీ మైసూర్ పాక్ తయారీ విధానం..
ముందుగా లోతుగా ఉండే ఇనుప కళాయిని తీసుకుని అందులో నూనె, నెయ్యి వేసుకుని వేడి చేయాలి. మరో కళాయిలో పంచదార, ఒక గ్లాస్ నీళ్లు పోసి పంచదార కరిగే వరకు కలుపుతూ వేడి చేయాలి. పంచదార లేత తీగపాకం రాగానే శనగపిండిని వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు ఒక గుంత గంటెను తీసుకుని కాగుతున్న నెయ్యిని పోస్తూ కలపాలి. ఇలా రెండు నిమిషాల కొకసారి నూనె, నెయ్యి పోస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా ఉడికించిన కొద్ది సేపటి తరువాత శనగపిండి నుండి నెయ్యి వేరవడం మొదలవుతుంది. ఇలా నెయ్యి వేరవగానే శనగపిండి మిశ్రమాన్ని నెయ్యి రాసిన గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దీనిని పైన సమానంగా చేసుకుని కొద్దిగా చల్లారే వరకు ఉంచాలి. తరువాత కావాల్సిన ఆకారంలో గాట్లు పెట్టుకుని పూర్తిగా చల్లారే వరకు ఉంచాలి. తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఘీ మైసూర్ పాక్ తయారవుతుంది. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మైసూర్ పాక్ తినాలనిపించినప్పుడు బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇంట్లోనే మైసూర్ పాక్ ను తయారు చేసుకుని తినవచ్చు.