Godhuma Pindi Halwa : మనం చాలా సులభంగా తయారు చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో హల్వా కూడా ఒకటి. హల్వా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. హల్వాను ఎక్కువగా మనం కార్న్ ఫ్లోర్, మైదాపిండి వంటి వాటితో తయారు చేస్తూ ఉంటాము. ఇవి మన ఆరోగ్యానికి అంత మంచివి కావు. వీటికి బదులుగా మనం గోధుమపిండితో కూడా హల్వాను తయారు చేసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు, పండుగలకు అలాగే నైవేద్యంగా కూడా ఈ హల్వాను తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ గోధుమపిండి హల్వాను సులభంగా, చాలా తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – అర కప్పు, గోధుమపిండి – ఒక కప్పు, నీళ్లు – 2 కప్పులు, పంచదార – ఒక కప్పు, జీడిపప్పు పలుకులు – 3 టేబుల్ స్పూన్స్, బాదం పలుకులు – 2 టీ స్పూన్స్, యాలకుల గింజలు – అర టీ స్పూన్, పిస్తా పలుకులు – 2 టీ స్పూన్స్, ఎండు ద్రాక్ష – 2 టీ స్పూన్స్.
గోధుమపిండి హల్వా తయారీ విధానం..
ముందుగా అడుగు మందంగా ఉండే కళాయిలో పావు కప్పు నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక గోధుమపిండి వేసి చిన్న మంటపై కలుపుతూ వేయించాలి. గోధుమపిండి ఎర్రగా రంగు మారిన తరువాత నీళ్లు, పంచదార వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. ఇలా 15 నిమిషాల పాటు ఉడికించిన తరువాత మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. దీనిని కళాయికి అంటుకోకుండా వేరయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. హల్వా చక్కగా ఉడికి నెయ్యి పైకి తేలిన తరువాత యాలకుల గింజలు, డ్రై ఫ్రూట్స్ మిగిలిన నెయ్యి వేసి కలపాలి. దీనిని మరో 5 నుండి 6 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. నెయ్యి చక్కగా పైకి తేలిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమపిండి హల్వా తయారవుతుంది. ఈవిధంగా చాలా సులభంగా మనం ఇంట్లోనే గోధుమపిండి హల్వాను తయారు చేసుకోవచ్చు. ఈ హల్వాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.