Manchurian Fried Rice : మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలల్లో లభించే రుచికరమైన వంటకాల్లో మంచూరియన్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. ఈ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ ఫ్రైడ్ రైస్ ను అదే స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. వెరైటీగా తినాలనిపించినప్పుడు, వీకెండ్స్ లో ఇలా మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ను ఇంట్లోనే తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, అందరికి నచ్చేలా మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మంచూరియన్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఫ్రెంచ్ బీన్స్ తరుగు – అర కప్పు, క్యారెట్ తరుగు – అర కప్పు, అన్నం – ఒక కప్పు బాస్మతీ బియ్యంతో వండినంత, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, పంచదార – పావు టీ స్పూన్, ఆరోమేటిక్ పౌడర్ – ఒక టీ స్పూన్, లైట్ సోయా సాస్ – 3/4 టీ స్పూన్, స్ప్రింగ్ ఆనియన్స్ – 2 టీ స్పూన్స్.
మంచూరియా తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాబేజి – చిన్నది ఒకటి, ఉడికించిన బంగాళాదుంప – 1, క్యారెట్ తురుము – అర కప్పు, కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మంచూరియన్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..
ముందుగా మంచూరియా తయారీకి గానూ ఒక గిన్నెలో క్యాబేజిని తురిమి వేసుకోవాలి. తరువాత ఉడికించిన బంగాళాదుంపను వేసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలు వేసి బాగా కలుపుకోవాలి. నీళ్లు పోయకుండా అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. తరువాత క్యాబేజి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండలుగా వేసుకోవాలి. వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని రెండు ముక్కలుగా కట్ చేసుకుని మరలా నూనెలో వేసుకుని క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్ తరుగు వేసి పెద్ద మంటపై వేయించాలి. వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత మంచురియా వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత అన్నం వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలు వేసి టాస్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మంచూరియన్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.