Golichina Kodi : గోలిచిన కోడి.. నాటుకోడితో చేసే ఈ తెలంగాణ వంటకం చాలా రుచిగా ఉంటుంది. స్మోకి పప్లేవర్ తో కారంగా, రుచిగా ఉండే ఈ కూరను ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడుగుతారు. అన్నం, రోటీ, చపాతీ ఇలా దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో కమ్మగా, రుచిగా ఉండే గోలిచిన కోడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోలిచిన కోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నాటుకోడి చికెన్ – అరకిలో, ఉప్పు – తగినంత, కారం – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉల్లిపాయ – 1, నూనె – 3 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 6, కాశ్మీరీ కారం – ఒక టీ స్పూన్.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండుకొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, లవంగాలు – 4, యాలకులు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, మిరియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, సాజీరా – పావు టీ స్పూన్, గసగసాలు – 2 టేబుల్ స్పూన్స్, పుట్నాల పప్పు – ఒక టేబుల్ స్పూన్.
గోలిచిన కోడి తయారీ విధానం..
ముందుగా గిన్నెలో చికెన్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఉల్లిపాయకు గాట్లు పెట్టుకుని మంటపై కాల్చుకోవాలి. ఉల్లిపాయ మెత్తగా అయిన తరువాత పైన పొరను తీసేసి రోట్లో వేసి మెత్తగా దంచుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చికెన్ వేసి కలపాలి. దీనిని 5 నిమిషాల పాటు పెద్ మంటపై వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.
తరువాత అదే కళాయిలో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత కాల్చిన ఉల్లిపాయ పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత వేయించిన చికెన్ వేసి కలపాలి. తరువాత కారం, పచ్చిమిర్చి వేసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తరువాత మసాలా పొడి వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోలిచిన చికెన్ తయారవుతుంది. ఈ చికెన్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. నాటుకోడితో తరచూ చేసే వంటకాలతో పాటు ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.