Healthy Roti : హెల్తీ రోటీ.. కింద చెప్పిన విధంగా సొరకాయతో చేసే ఈ రోటీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ రోటీలను తయారు చేయడం కూడా చాలా సులభం. 10 నిమిషాల్లోనే మనం ఈ రోటీలను తయారు చేసుకోవచ్చు. అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ హెల్తీ రోటీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హెల్తీ రోటీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యంపిండి – అర కప్పు, గోధుమపిండి – అర కప్పు, సొరకాయ తురుము – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, జీలకర్ర – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నువ్వులు – 2 టీ స్పూన్స్, నూనె – 2 టీ స్పూన్స్.
హెల్తీ రోటీ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో బియ్యంపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలన్నింటిని వేసి బాగా కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. తరువాత ఈ చపాతీని పెనం మీద వేసి కాల్చుకోవాలి. ముందుగా రెండు వైపులా కొద్ది కొద్దిగా కాల్చుకున్న తరువాత నూనె వేసి కాల్చుకోవాలి. చపాతీ చక్కగా కాలిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చపాతీ తయారవుతుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ చపాతీ చక్కగా ఉంటుంది. ఇలా ఉదయం పూట అప్పటికప్పుడు రుచికరమైన మరియు ఆరోగ్యానికి మేలు చేసే చపాతీలను తయారు చేసుకుని తినవచ్చు.